Painful muscle aches in winter!
Muscle Aches : శీతాకాలం చలికారణంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీరంలో నొప్పులు అధికం కావటంతోపాటు, ఒత్తిడిని అనుభవిస్తారు. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు నీరసం అధికమౌతుంది. ఆర్థరైటిస్ ఉన్నవారు వారి కీళ్లలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. చలికాలంలో వాతావరణంలోని చల్లదనానికి కీళ్లమధ్యలో ఉండే మృదువైన కార్టిలేజ్ కుచించుకుపోయి సయనోవియల్ ఫ్లూయిడ్ చిక్కబడుతుంది. దీంతో చర్మం, కండరాలు బిగుసుకుపోతాయి. దీనివల్ల కీళ్లనొప్పులు సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
చలికాలంలో శరీర కదలికలపై పరిమితులు ఉండటం వల్ల చాలా మందికి శరీర నొప్పులు, కండరాలు లేదా నరాలలో నొప్పులు ఉంటాయి. మనం వ్యాయామం చేయనప్పుడు , చలికాలంలో కదలిక లేనప్పుడు తలనొప్పి, వెన్ను, మెడ వంటి ప్రాంతాల్లో నొప్పులు అధికంగా ఉంటాయి. బైక్ వంటి ద్విచక్రవాహనాలు నడిపే వారిలో చలికాలంలో నొప్పులు ఎక్కువగా ఉంటాయి.
చలికాలంలో నొప్పుల నుండి తప్పించుకునేందుకు ;
చలికాలంలో కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి ఆవాల నూనె బాగా ఉపకరిస్తుంది. ఇది చర్మం యొక్క ఉపరితలంపై రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. నాలుగు చెంచాల ఆవాల నూనె వేడి చేసి అందులో పది వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వెల్లుల్లి బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేడి చేసి, కర్పూరం ఆకులను వేసుకోవాలి. తర్వాత చల్లార్చి ఫిల్టర్ చేయాలి. వడకట్టిన నూనెను నొప్పి ఉన్న ప్రాంతంలో అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. వెల్లుల్లిలోని సల్ఫర్ మరియు సెలీనియం రెండూ కండరాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. రోజు చేస్తుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.
అరటిపండ్లు కండరాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాల నొప్పుల వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించటంలో సహాయపడుతుంది. శరీరంలో పొటాషియం తక్కువగా ఉండటం వల్ల కండరాల బలహీనత, అలసట మరియు కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. చలికాలంలో పెద్దగా దాహం వేయకపోవటంతో నీరు తక్కువ మోతాదులో తీసుకుంటుంటారు. తగినంత నీరు లేనప్పుడు, కండరాలు బిగుతుగా మారతాయి.కండరాల నొప్పితో బాధపడేవారు తగినంత నీరు తీసుకోవాలి. హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం.
స్ట్రెచింగ్ వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. కండరాల నొప్పులు వచ్చినప్పుడు స్ట్రెచింగ్ చేయాలి. కండరాలలో నొప్పి అనిపిస్తే, మీరు ప్రభావిత ప్రాంతంలో గోరు వెచ్చని నూనెతో మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. తులసిలో నొప్పిని తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇది కండరాలకు మసాజ్ చేయడం ద్వారా ఉపశమనం కలిగిస్తుంది. రెండు చెంచాల తులసి రసాన్ని తీసుకుని నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
చలికాలంలో జంక్ ఫుడ్ తగ్గించి శరీరంలో వేడిని పెంచే ఫుడ్ తీసుకోవాలి. ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, విటమిన్–డి, ప్రొటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. చల్లటి ఫుడ్స్ తగ్గించాలి. కీళ్లను వెచ్చగా ఉంచుకునేందుకు మందపాటి బట్టలు వేసుకోవాలి. శరీరానికి చలిగాలి తగలకుండా చూసుకోవాలి. నొప్పుల నుండి ఉపశమనం కోసం వేడినీళ్ల కాపడం, మసాజ్, ఫిజియోథెరపీ వ్యాయామాలు లాంటివి ఉపయోగపడతాయి.