Rejection Sensitive Dysphoria : RSD ఇదో వింత జబ్బు.. అందరూ మనల్నే అన్నట్టు ఫీలింగ్.. చిన్న విమర్శకే… మీకూ ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి..
Rejection Sensitive Dysphoria : చిన్న విమర్శ ఎదురైనా.. నో చెప్పినా.. మీ గుండె మెలిపెట్టనట్లు అవుతుందా. అయితే ఇది RSD అనే వింత జబ్బు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ..
rejection sensitive dysphoria rsd symptoms and treatment
Rejection Sensitive Dysphoria : కొందరు ఎన్ని విమర్శలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. కానీ కొద్ది మంది మాత్రం చిన్న విమర్శను కూడా తట్టుకోలేరు. ఎవరైనా వారికి ‘నో’ చెప్పినా.. తిరస్కరించినా.. సరదాకి ఆటపట్టించేలా కామెంట్స్ చేసినా సరే అస్సలు తట్టుకోలేరు. ఆ సమయంలో తీవ్రమైన భావోద్వేగానికి గురై.. గుండెను ఎవరో మెలిపెట్టినట్లుగా భావిస్తారు. ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితిని నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు నిపుణులు. ఇది రిజెక్షన్ సెన్సిటివ్ డిస్ఫోరియా (RSD) అనే మానసిక పరిస్థితి అంటున్నారు.
ఇలాంటి మానసిక స్థితి ఉన్న వాళ్లు చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా బాధపడుతుంటారు. వారి మీద చిన్న జోక్ వేసినా.. తప్పు ఎత్తి చూపించినా.. దాన్ని పెద్ద అవమానంగా భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో వారు తీవ్రమైన ఉద్వేగానికి గురవుతారు. దీంతో ఛాతి బిగుసుకోవడం, గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటుగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఈ రిజెక్షన్ సెన్సిటివ్ డిస్ఫోరియా అనేది ఎక్కువగా.. అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తుల్లో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే RSD పరిస్థితిని మానసిక రుగ్మతల్లో చేర్చలేదు. దీంతో అధికారికంగా ఎలాంటి చికిత్స లేదు. కానీ మానసిక ఆరోగ్య నిపుణులు దీనిని గుర్తించి చికిత్స చేయడానికి ప్రయత్నిస్తున్నారు. RSD ఉన్న వారిలో కొందరు.. ఇతరులు విమర్శిస్తారనే భయంతో.. ఎలాంటి పని ప్రారంభించాలన్నా భయపడి వెనకడుగు వేస్తారు. అలానే తమ చుట్టూ ఉన్న వారు, ఆత్మీయుల దగ్గర నుంచి విమర్శలు వస్తాయనే భయంతో వారిని సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తూ.. తమ గురించి ఆలోచించడం కూడా మరిచిపోతారు. అలానే తప్పులు చేస్తే ఎత్తి చూపుతారు, విమర్శిస్తారనే భయంతో.. ప్రతి పనిని పరిపూర్ణంగా చేయాలని భావించి ఎక్కువ ఒత్తిడికి గురవుతారు.
కొంతమంది తిరస్కరణను ఎదుర్కోలేక.. లేదంటే ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో ఎవరితోనూ పెద్దగా కలవరు. వీరికి సామాజిక సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి. స్నేహితులు తక్కువే.. ఆఖరికి ఉద్యోగ అవకాశాలను సైతం పక్కకు పెడతారు. RSD వంటి మానసిక రుగ్మతతో బాధపడేవారు చిన్న విమర్శ, తిరస్కరణ ఎదురైనా సాధారణ వ్యక్తుల కన్నా చాలా తీవ్రంగా బాధపడతారు. తీవ్ర భావోద్వేగానికి గురవుతారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. ఆలస్యం చేయకుండా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది. సరైన అవగాహన, సహాయం ఉంటే ఈ సమస్యను సులభంగా ఎదుర్కోవచ్చు. కౌన్సెలింగ్, థెరపీతో ఈ సమస్యను అధిగమించవచ్చు.
