Eating Tambulam
Eating Tambulam : తాంబూలం లో వాడే తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆకులోకి వక్క, సున్నం తో పాటు కాసింత జాజికాయ, పచ్చ కర్పూరం, కుంకుమ పుష్పం, యాలకుల పొడి, కస్తూరి మొదలైనవి వాడతారు. ఇవన్నీ ఆయుర్వేద పరంగా ఆరోగ్యానికి మేలు చేసేవే. భారతీయులు భోజనం చేసిన తర్వాత తాంబూలం నములుతూ ఉంటారు. కడుపు నిండుగా భోజనం చేసిన తర్వాత తాంబూలం తింటే జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుందని నమ్ముతారు. ఆయుర్వేద గ్రంధాల్లోనూ ఇదే విషయం స్పష్టంగా ఉంది.
ఎముకలను దృఢంగా ఉంచడానికి ఉపయోగపడే కాల్షియం విటమిన్ ఎ, విటమిన్ సి వంటివి సమృద్ధిగా మన శరీరానికి అందుతాయి. కడుపు, ప్రేగుల్లో పి.హెచ్ అసమతుల్యతను సమర్ధవంతంగా అడ్డుకుంటుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కృత్రిమ రంగులు, కృత్రిమ సువాసనలు జతచేసిన పాన్ లు, సంప్రదాయమైన తాంబూలం ఇచ్చిన ఫలితాలను మాత్రం ఇవ్వలేవనే చెప్పాలి.
ఇంత వరకు బాగానే ఉన్నా తాంబూలం సేవించిన తర్వాత తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించిన విషయం చాలామందికి సరైన అవగాహన ఉండదు. తాంబూలం తిన్న తర్వాత కొన్ని ఆహారపదార్థాలు తినకూడదు. తాంబూలం తీసుకున్న గంట వరకు పాలు తాగకూడదు. తాగితే దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మసాలాతో వండిన ఆహార పదార్థాలను కిల్లి తిన్న తర్వాత తినకూడదు. కాదని తింటే మాత్రం మలబద్ధకంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే పాన్ తిన్న తరువాత చల్లని నీళ్లు తాగడం వలన శ్వాసకోశ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అందుకోసం చల్లని నీటిని అస్సలు తాగకూడదు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తాంబూలం తిన్న తర్వాత ఎలాంటి మందులను వేయకూడదు. కాదని మింగటం వల్ల తలనొప్పి, కడుపునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
తమలపాకులను మితంగా తీసుకుంటే ఔషధం, అతిగా తీసుకుంటే విషం అవుతుందని నిపుణులు వార్న్ చేస్తున్నారు. తమలపాకులపై రాసిన సున్నం వల్ల సైతం కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తమలపాకులతో కలిపి వక్కలు తినేవారికి దీర్ఘకాలంలో కిడ్నీ జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది.