షాకైన డాక్టర్లు : బాలిక కడుపులో అరకిలో జుట్టు, షాంపు ప్యాకెట్లు!

  • Publish Date - January 28, 2020 / 02:29 AM IST

తమిళనాడులో ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. 13ఏళ్ల బాలిక కడుపులో అరకిలో జుట్టు, ఖాళీ షాంపు ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ ఘటన కోయింబత్తూరు ఆస్పత్రిలో వెలుగులోకి వచ్చింది. 7వ తరగతి చదువుతున్న బాలిక కడుపులో నుంచి జుట్టు, ఖాళీ షాంపు ప్యాకెట్లను విజయవంతంగా సర్జరీ చేసి తొలగించినట్టు వైద్యులు వెల్లడించారు. కొన్ని నెలల నుంచి బాలిక తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోంది. రెండు రోజుల క్రితం నొప్పి మరింత తీవ్రం కావడంతో ఆమెను కోయింబత్తూరు ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి వైద్యపరీక్షలు చేసిన వైద్యులు షాక్ అయ్యారు.

వెంటనే ఎండోస్కోపీ ద్వారా కడుపులోని జట్టు, షాంపు ప్యాకెట్లను తొలగించినట్టు ఆస్పత్రి చైర్మన్ వి.జి. మోహన్ ప్రసాద్ తెలిపారు. అందిన వివరాల ప్రకారం.. బాలిక 7వ తరగతి చదువుతోంది. తన దగ్గరి బంధువు ఒకరు ఈ మధ్యే చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. మానసికంగా కృంగిపోతోంది. అప్పటినుంచి బాలిక మానసిక స్థితి సరిగాలేదని, తరచూ వెంట్రుకలు, ఖాళీ షాంపూ ప్యాకెట్లను మింగేస్తోంది.

అలా మింగిన జట్టు మొత్తం అరకిలో వరకు కడుపులో ఉండిపోయింది. దీంతో కడుపులో నొప్పి అంటూ బాలిక బాధపడుతుండటంతో ఆమెను ఆస్పత్రికి తీసుకోచ్చారు. పరీక్షించిన వైద్యులు బాలిక కడపులో జుట్టు, షాంపులు ఉండటం చూసి షాక్ అయ్యారు. అనంతరం బాలికకు ఎండోస్కోపీ ద్వారా కడుపులోని వెంట్రుకలు, షాంపులను తొలగించారు.