Winter Skin Care :
Winter Skin Care : చలికాలం వచ్చిందంటే చర్మం పట్ల జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. చలికాలంలో చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా చర్మం పొడిబారడం, పగుళ్ళు ఏర్పడటం వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే వీటి బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వణుకు పుట్టించే చలి చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే క్రీములను కొనుగోలు చేసి చర్మానికి అప్లై చేస్తుంటారు. ఇలా చేస్తే, కొత్తకొత్త సమస్యలుకోరితెచ్చుకోవాల్సి వస్తుంది. చలికాలంలో ప్రతి ఒక్కరి చర్మం చాలా పొడిగా, నిర్జీవంగా మారడం ప్రారంభమవుతుంది. చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చలిగాలుల నుండి చర్మాన్ని కాపాడుకోవచ్చు.
చలికాలంలో చర్మ రక్షణకోసం జాగ్రత్తలు ;
1. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. అలాగే ఎక్కువ సేపు స్నానం చేయకూడదు. ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల చర్మం మరింత పొడిగా మారుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం వేడివేడి నీళ్లతో స్నానం చేస్తారు. ఆ సమయానికి హాయిగా ఉంటుంది కానీ, ఈ అలవాటు చర్మ ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. రసాయనాలులేని సేంద్రియ సబ్బులు వాడటం మరీ మంచిది.
2. ఒకరోజులో ఎక్కువ సార్లు ముఖాన్ని కడగడం మానేయాలి. రోజులో రెండుసార్లు కడిగితే సరిపోతుంది. చర్మాన్ని తేమగా చేసేందుకు మాయిశ్చరైజర్ వాడటం మంచిది. మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఏది పడితే అది తెచ్చుకోవద్దు. మీ చర్మం రకానికి ఏది సెట్ అవుతుందో అది మాత్రమే వాడండి.
3. చలి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు స్వెటర్ తోపాటుగా కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌజులు ధరించాలి. బయటికి వెళ్లినప్పుడు ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవాలి. ఇలాంటి జాగ్రత్తల వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
4. పెదాలు ఎండిపోయి పగుళ్ళు ఏర్పడితే వాటికి నెయ్యి పూసుకోవడం మంచిది. రాత్రిపూట నెయ్యితో మర్దన చేసుకుంటే తెల్లారే సరికి తేమగా తయారవుతాయి. వీలైనన్ని ఎక్కువ నీటిని తాగాలి. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంలో తేమ శాతం పెరుగుతుంది.
5. మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా కూరగాయల్లో ఆకుకూరలు బాగా తినాలి. గుడ్లు, దానిమ్మ మొదలైనవి చర్మ సంరక్షణకి బాగా ఉపయోగపడతాయి. చలికాలంలోనూ సూర్యరశ్మి చర్మానికి హాని చేస్తుంది. రుతువులతో సంబంధం లేకుండా, బయటికి వెళ్లినప్పుడు చర్మానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం ఉత్తమం.
6. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి చలికాలంలో దురద సమస్య ఉండవచ్చు. అటువంటి చర్మం ఉన్నవారు తమ కోసం క్రీమ్‌ను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ చర్మంపై చాలా క్రీమ్‌లు అలెర్జీని కలిగిస్తాయి. వీలైనంత వరకు ఈ వ్యక్తులు యాంటీఆక్సిడెంట్లు సువాసనలు లేని క్రీములను ఎంచుకోవాలి.
7. చలికాలం అరికాళ్ళలో పగుళ్ళు ఇబ్బంది పెడుతుంటాయి. పడుకునే మాయిశ్చరైజర్ రాసుకుని సాక్స్‌లు ధరించి పడుకోవాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే అరికాళ్ళలో పగుళ్ళు తగ్గిపోతాయి.