Deewana Review : ‘దీవాన’ మూవీ రివ్యూ.. ఇంటర్వెల్ ట్విస్ట్ మాములుగా లేదుగా.. ట్రైలర్ చూసి మోసపోవద్దు..
దీవానా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇదేదో అర్జున్ రెడ్డి, బేబీ.. లాంటి ప్రేమ కథ అని అంతా అనుకున్నారు కానీ..(Deewana Review)
Deewana Review
Deewana Review : హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా తెరకెక్కిన సినిమా ‘దీవాన’. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాణంలో శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. మొదట జూన్ 19న థియేటర్స్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ జూన్ 20 నుంచి రిలీజ్ చేస్తున్నట్టు చివరి నిమిషంలో ప్రకటించారు. కానీ ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే..
మున్నా(హర్షిత్ రెడ్డి) డిగ్రీ అయిపోయి ఖాళీగా తన ఫ్రెండ్స్ విక్రాంత్, మోటూతో తిరుగుతూ ఇంట్లో పేరెంట్స్ మాట వినకుండా ఉంటాడు. ఓ రోజు సడెన్ గా అమ్ము(స్నేహ మణిమేగలై)ని చూసి మొదటి చూపులోనే ఇష్టపడతాడు. తర్వాత తను మీ సేవ ఆఫీస్ లో పనిచేయడం చూసి డైలీ ఏదో వంకతో వెళ్లి ఆమెని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అమ్ము ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు. ఈ క్రమంలో అమ్ముని ఇబ్బంది పెట్టిన వాళ్ళను కొడతాడు మున్నా. ఓ రోజు అమ్ము దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా తన లవ్ మ్యాటర్ చెప్పడంతో నాది గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని రా అప్పుడు ఆలోచిద్దాం అంటుంది అమ్ము.
అదే సమయంలో అనుకోకుండా పోలీసులు మున్నాని తీసుకెళతారు. తర్వాత మున్నా తండ్రి(నరేష్) మున్నాని ఇంట్లోంచి గెంటేస్తాడు. అసలు మున్నాని పోలీసులు ఎందుకు తీసుకెళ్తారు. మున్నా అమ్ము కోసం గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటాడా? మున్నా పేరెంట్స్ ని అర్ధం చేసుకుంటాడా? అసలు అమ్ము బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇంటర్వెల్ కి అమ్ము ఇచ్చే షాక్ ఏంటి.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Maa Inti Bangaram Review : ‘మా ఇంటి బంగారం’ రివ్యూ.. అయ్య బాబోయ్ సమంత యాక్షన్ అదరగొట్టిందిగా..
సినిమా విశ్లేషణ..
పలు వెబ్ సిరీస్ లు, శుభం, కల్కి సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్నాడు హర్షిత్ రెడ్డి. మొదటిసారి సినిమా హీరోగా సోలో మెయిన్ లీడ్ చేసాడు. దీవానా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇదేదో అర్జున్ రెడ్డి, బేబీ.. లాంటి ప్రేమ కథ అని అంతా అనుకున్నారు కానీ కాదు అని సినిమా చూసాక అర్ధమవుతుంది. ప్రమోషన్స్ మాత్రం బాగానే చేసారు. డైరెక్టర్ ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ తో హైప్ ఇచ్చాడు.
ఫస్ట్ హాఫ్ హీరో, ఫ్రెండ్స్ తో తిరగడాలు.. రొటీన్ అన్ని సినిమాల్లాగే ఉంటుంది. హీరోయిన్ ని చూడటం, ఆమె వెంట పడటం కొంచెం క్యూట్ గా, కామెడీగా చూపించారు. అక్కడక్కడా పేరెంట్స్ తో హీరో ఎలా ఉంటాడు, హీరో గొడవలతో సాగదీశారు. ఇంటర్వెల్ ముందు హీరోని పోలీసులు తీసుకెళ్లే సీన్, ఆ తర్వాత జరిగే సీన్ రొటీన్ సీన్స్ అయినా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఉత్కంఠగా సాగుతాయి. ఇంటర్వెల్ కి ఆడియన్స్ కి హీరోయిన్ నుంచి అదిరిపోయే ట్విస్ట్ వస్తుంది. అసలు సినిమా చూస్తున్నంతసేపు ఆ ట్విస్ట్ ఎవరూ ఊహించారు. ఈ విషయంలో డైరెక్టర్ ని మెచ్చుకోవచ్చు.
ఇక సెకండ్ హాఫ్ హీరో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించడం, హీరో గొడవలు, హీరోయిన్ ఎవరు? ఏంటి అని సాగుతుంది. క్లైమాక్స్ అయితే ఫుల్ ఎమోషన్. క్లైమాక్స్ లో కూడా ఓ ట్విస్ట్ ఉంటుంది కానీ ఊహించేయోచ్చు. ఇలాంటి మూల కథతో హీరో – హీరోయిన్ ఎమోషన్ తో బోలెడన్ని సినిమాలు వచ్చి ఉండొచ్చు కానీ జెన్ జీకి, అందరికి కనెక్ట్ అయ్యేట్టు ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఎంగేజింగ్ గా బాగానే తెరకెక్కించారు. ఆ ట్విస్ట్ ఏంటి అనేది సినిమాలో చూస్తేనే బాగుంటుంది.
హీరో, అతని ఫ్రెండ్స్ పడే గొడవలు కొంత అక్కడక్కడా సాగదీత అనిపిస్తాయి. ఇక సినిమా అంతా హైదరాబాద్ లోకల్ లో జరగడం, పక్కా తెలంగాణ, హిందీ బాష డైలాగ్స్ ఉండటంతో అందరికి కొన్ని డైలాగ్స్ అర్ధం కాకపోవచ్చు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు అనుకున్న వాళ్ళని కూడా తర్వాత వాళ్ళతో మంచి ఎమోషన్, సీన్స్ పండించారు. ఇక పేరెంట్స్ ఎమోషన్, ముఖ్యంగా ఫాదర్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. ఫ్రెండ్స్ ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ చేసారు. అక్కడక్కడా కొంత సాగదీసినా మంచి ఎమోషనల్ ప్రేమకథని తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్స్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి చూడొచ్చు. దీవాన అంటే ప్రేమ పిచ్చి పెట్టినవాడు అని అర్ధం. ఇందులో హీరో పాత్రకు కరెక్ట్ గా సరిపోతుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్..
ఇన్నాళ్లు సాఫ్ట్ పాత్రలు చేసిన హర్షిత్ రెడ్డి ఇందులో హైదరాబాద్ లోకల్ అబ్బాయిగా కాస్త మాస్ పాత్రలో కనిపించి తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తాడు. మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే హర్షిత్ రెడ్డి మంచి నటుడు అవ్వడం ఖాయం. కొత్త అమ్మాయి స్మేహ మణిమేగలై అయితే తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. అసలు హీరోయిన్ గా మొదటి సినిమాకే ఇలాంటి పాత్ర ఒప్పుకోవడం అంటే ఛాలెంజ్ అని చెప్పాలి. .
హీరో తండ్రి పాత్రలో నరేష్ కూడా మంచి ఎమోషన్ ని పండించారు. రోలర్ రఘు, జబర్దస్త్ వేణు.. కాసేపే కనిపించినా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరో ఫ్రెండ్ విక్రాంత్, మోటూ పాత్రల్లో చేసిన నటులు కూడా బాగా నటించారు. హీరోయిన్ ఫ్రెండ్ స్వప్న పాత్ర చేసిన అమ్మాయి మాత్రం అక్కడక్కడా ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. జీవన్ కుమార్ పాత్ర కూడా కాస్త ఓవర్ గా అనిపిస్తుంది. ఝాన్సీ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ రియాల్టీగా ఉన్నాయి. పాటలు కూడా చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా ఇంటర్వెల్ కి సీతా రామం మ్యూజిక్ అచ్చు దించేశారు. ఆ సీన్ కి మాత్రం అది పర్ఫెక్ట్ గా సరిపోయింది. హీరోయిన్ డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. లొకేషన్స్ అన్ని హైదరాబాద్ లోకల్ అవ్వడంతో రియాలిటీకి దగ్గరగా ఉంది.
ఇలాంటి కథలు చాలా వచ్చినా ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఎంగేజింగ్ గా మంచి లవ్ స్టోరీని రాసుకొని ఎమోషనల్ గా తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా చిన్న సినిమా అయినా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై క్వాలిటీ అవుట్ పుట్ కనిపిస్తుంది.
మొత్తంగా ‘దీవానా’ సినిమా ఆసక్తికర ఇంటర్వెల్ బ్యాంగ్ తో తెరకెక్కిన ఓ మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
