Chennai Love Story Review : ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం మళ్ళీ హిట్ కొట్టాడా?
చెన్నై లవ్ స్టోరీ సినిమా జులై 24న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. (Chennai Love Story Movie Review)
Kiran Abbavaram Chennai Love Story Review
Chennai Love Story Review : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా తెరకెక్కిన సినిమా చెన్నై లవ్ స్టోరీ. SKN, సాయి రాజేష్, ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో రవి నంబూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చెన్నై లవ్ స్టోరీ సినిమా జులై 24న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే..
నివి(శ్రీ గౌరీప్రియ)- అజయ్(త్రిగున్) ప్రేమించుకొని పెళ్లి దాకా వెళ్తారు. కానీ పెళ్లి రోజు అజయ్ ఇంకో అమ్మాయిని ప్రేమించాను అని నివిని వదిలేసి వెళ్ళిపోతాడు. దీంతో నివి చెన్నైలో తన జాబ్ కి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ డిప్రెషన్ లోకి వెళ్ళి మద్యానికి బానిస అవుతుంది. ఓ రోజు నివి, తన రూమ్ మేట్స్ అమ్మాయిలు, అబ్బాయిలతో కలిసి చెన్నై బీచ్ లో కూర్చొని తాగుతుంటే స్టీవెన్ శంకర్(కిరణ్ అబ్బవరం) అనుకోకుండా వీరికి పరిచయం అవుతాడు. స్టీవెన్ ఓ అనాథ, ఎవరూ లేరు. సినిమా డైరెక్టర్ అవ్వాలని తిరుగుతున్నాను అని చెప్పి నివి ఫ్రెండ్స్ ని సాయం అడగడంతో వాళ్ళ రూమ్ లో ఉండనిస్తారు.
దీంతో స్టీవెన్ సినిమా ఛాన్సులు ట్రై చేస్తూ, రూమ్ లో పనులు చేస్తూ నివిని మార్చాలని ట్రై చేస్తాడు. ఇది నచ్చని నివి ఓ రోజు స్టీవెన్ ని బాగా తిట్టేస్తుంది. తర్వాత తనే తప్పు చేశాను అని తెలుసుకొని నివి స్టీవెన్ కోసం ఓ దర్శకుడు(పి వాసు)తో మాట్లాడి కథ చెప్పడానికి అపాయింట్మెంట్ తీసుకుంటుంది. ఈ పని చేయడంతో స్టీవెన్ నివిని ఒక దేవతలా గొప్పగా చూస్తాడు. మరి స్టీవెన్ దర్శకుడు అయ్యాడా? నివి అజయ్ డిప్రెషన్ నుంచి బయటకు వస్తుందా? అజయ్ మళ్ళీ నివి లైఫ్ లోకి వస్తాడా? నివి ఎవర్ని పెళ్లి చేసుకుంటుంది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Jana Nayakudu Review : ‘జన నాయకుడు’ రివ్యూ.. విజయ్ లాస్ట్ సినిమా ఎలా ఉందంటే.. భగవంత్ కేసరి రీమేకేనా?
సినిమా విశ్లేషణ..
మంచి హిట్స్ తో ఫామ్ లో ఉన్న కిరణ్ అబ్బవరం, బేబీ తర్వాత SKN, సాయి రాజేష్ కలిసి తీస్తున్న సినిమా అవ్వడం, పాటలు, ట్రైలర్, టీజర్ బాగుండటం, చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
ఫస్ట్ హాఫ్ హీరాయిన్, హీరో పాత్రల పరిచయం, అక్కడక్కడా కామెడీ, హీరోయిన్ దేవదాసులా మారడం, నివిని స్టీవెన్ మార్చడం, స్టీవెన్ సినిమా ఛాన్సులు కోసం తిరగడం, వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడటం.. లాంటి సీన్స్ తో సింపుల్ గా క్యూట్ గా నడిపించారు. ఇంటర్వెల్ కి ఓ ట్విస్ట్ తో షాక్ ఇస్తారు. అయితే రెగ్యులర్ గా సినిమాలు ఎక్కువగా చూసేవాళ్ళు ఆ ట్విస్ట్ ఊహించేయొచ్చు. ఆ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ ఎలా నడిపిస్తారు అనే సస్పెన్స్ నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో హీరోయిన్ మళ్ళీ బాధలోకి వెళ్లే సీన్స్ తో మొదలయి ఓ ఆసక్తికర సన్నివేశంతో సాగుతుంది.
కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం సాగదీశారు అనిపిస్తుంది. హీరోయిన్ ప్రేమ విషయంలో కన్ఫ్యూజన్ లో ఉండటంతో ఇంకా క్లారిటీ ఇవ్వరేంటి అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఎక్కువగా ఎమోషనల్ గా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాడ్ లో కిరణ్ కామెడీ సీన్స్ కి అయితే ఫుల్ గా నవ్వుకుంటారు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో లాజిక్స్ వెతకకుండా ఉంటే సినిమాని ఎంజాయ్ చేస్తాం. సెకండ్ హాఫ్ మాత్రం సాగదీశారు. గతంలో కొన్ని సినిమాలు ఈ కథ కాకపోయినా ఇలాంటి కథనంతో అయితే వచ్చాయి. ప్రీ క్లైమాక్స్ లో కుక్కతో వచ్చే ఓ యాక్షన్ సీన్ బాగుంటుంది. లవ్ సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. క్లైమాక్స్ కూడా ఎమోషనల్ గానే ముగించారు. సినిమాలో కొన్ని సీన్స్ కి కన్నీళ్లు అయితే పెట్టుకుంటారు.
చెన్నై అని చెప్పి చాలా సీన్స్ చీరాల, హైదరాబాద్ లోనే షూట్ చేసారు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ వరకు చెన్నై లో చేసి చెన్నై ఫీల్ తెప్పించే ప్రయత్నం చేసారు. ఫస్ట్ లవ్ తోపు కాదు అని చెప్పి మళ్ళీ సెకండ్ లవ్ తర్వాత కొంత కన్ఫ్యూజ్ చేసి చివరకు ఒక కంక్లూజన్ అయితే ఇచ్చారు అనిపించేలా చేసారు చెన్నై లవ్ స్టోరీని. ఫ్రెండ్స్, ప్రేమికులతో కలిసి ఈ సినిమా థియేటర్లో చూడొచ్చు. హీరో పాత్రని చూస్తే సాయి రాజేష్, డైరెక్టర్ రవి తమ రియల్ లైఫ్ సీన్స్ రాసుకున్నారేమో అని అనుమానం రాక మానదు. టాలీవుడ్ పైన అక్కడక్కడా పంచులు వేయడం గమనార్హం. లవ్ సినిమాలు, విషాద సినిమాలు నచ్చేవాళ్లకు చెన్నై లవ్ స్టోరీ నచ్చుతుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్..
కిరణ్ అబ్బవరం ఆ పాత్రకు తగట్టు చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. సినిమా సినిమాకు తన నటనను బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు కిరణ్ అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు హీరో కిరణ్ అనేకంటే శ్రీ గౌరీప్రియ అనే చెప్పాలి. తెలుగమ్మాయి శ్రీ గౌరీప్రియ ఈ సినిమాలో జీవించేసింది. అసలు ఇంటర్వెల్ తర్వాత తాగి నటించే ఓ సీన్ లో అయితే అదరగొట్టేసింది. సినిమా అంతా డిప్రెషన్, అక్కడక్కడా సంతోషం ఎమోషన్స్ ని చాలా బాగా చూపించింది. శ్రీ గౌరీప్రియకు ఈ సినిమాకు అవార్డులు కచ్చితంగా రావాలి. ఈ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.
త్రిగున్ కూడా బాగానే నటించాడు. ఫ్రెండ్స్ పాత్రల్లో సిరి హనుమంత్, మహేందర్, పూజ, నవీన్.. బాగానే మెప్పించారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ పి వాసు గెస్ట్ పాత్రలో కనిపించి మెరిపించారు. ప్రమోదిని, దేవి ప్రసాద్, కరుణ కుమార్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Varanasi : ‘వారణాసి’ టైటిల్ నాదే.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చేసాను..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాకు తీసుకున్న కలర్ ప్యాలెట్ కథకు బాగా సరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. చాన్నాళ్ల తర్వాత మణిశర్మ ఈజ్ బ్యాక్ అనిపించింది. ఇక సాంగ్స్ అయితే రిపీటెడ్ లో ఎన్ని సార్లు అయినా వినొచ్చు. అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. సాహిత్యం కూడా చాలా అర్థవంతంగా ఉంది.
ముఖ్యంగా ప్రేమ మీద, జీవితం మీద రాసిన కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. కథ కాస్త కొత్తది అయినా కథనం ఇంకాస్త కొత్తగా రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో మాత్రం సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ కట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. నిర్మాణ పరంగా కూడా సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓ అమ్మాయి జీవితంలోకి వచ్చిన రెండు ప్రేమల మధ్య సాగే ఎమోషనల్ కథ. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
