Mister Middle Class Review : ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ మూవీ రివ్యూ.. వెంకటేశ్వరస్వామిగా రాజేంద్రప్రసాద్.. ఎలా ఉందంటే..?
రాజేంద్రప్రసాద్ మొదటిసారి వెంకటేశ్వరస్వామిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. (Mister Middle Class Review)
Mister Middle Class Review
Mister Middle Class Review : శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, లయ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’. బ్లూ.J క్రియేషన్స్ బ్యానర్ పై GK, చందు నిర్మాణంలో జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా జులై 17న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. అలీ, సునీల్, రఘుబాబు, బాబూమోహన్, ధనరాజ్, వెన్నెల కిషోర్, పృథ్వీ, మురళి గౌడ్, కరుణ భూషణ్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
కథ విషయానికొస్తే..
వెంకటరమణ(శ్రీకాంత్) ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి. వేంకటేశ్వరస్వామికి వీర భక్తుడు. తన భార్య పద్మావతి(లయ), తండ్రి ఏడుకొండలు(మురళి గాడ్), చెల్లి(కరుణ), బావ(భూపాల్), పిల్లలతో కలిసి ఉంటాడు. వీళ్లంతా ఓ హోటల్ నడిపిస్తూ అది బాగా సాగినా అత్యాశకు పోయి అప్పు చేసి మరీ రెస్టారెంట్ పెట్టి లాస్ అవుతారు. దాంతో పెట్టిన హోటల్ ని వేరే వాళ్లకు అమ్మేసి అందులోనే పనిచేయాల్సి వస్తుంది. అందరు మిడిల్ క్లాస్ లకు ఉండే పిల్లల ఫీజులు, నాన్న మందులు, ఇంట్లో సరుకులు.. ఇలా బాధలతో పాటు చేసిన అప్పు కట్టలేక సతమతమవుతుంటాడు వెంకటరమణ. ఓ సంఘటనతో జాబ్స్ కూడా పోయి పరిస్థితి చేయి దాటి ఏమి చేయాలని స్థితికి వచ్చేయడంతో బాధపడుతూ వేంకటేశ్వరస్వామిని తిట్టుకొని తనని చంపేయమని సెక్యూరిటీ గార్డ్ గా చేరి గుడి మెట్ల మీద నిద్రపోతాడు.
దీంతో వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై ఏం కావాలో అని అడగ్గా ఆయన నగలు ఇమ్మంటాడు. ఆ నగలతో ఇంటికి వెళ్తే వాళ్ళు అవి గిల్టీ నగలు అనుకోని చెరువులో పడేస్తారు. ఓ నగను అమ్మడానికి వెళ్తే అది పోలీసుల దాకా వెళ్తుంది. దీంతో మళ్ళీ చచ్చిపోదామని వెళ్తే వేంకటేశ్వరస్వామి మళ్ళీ వచ్చి ఓ బుక్ ఇచ్చి అందులో ఏం రాస్తే అదే జరుగుగుతుంది అని కొన్ని కండిషన్స్ పెడతాడు. అసలు ఆ బుక్ ఏంటి? ఆ బుక్ కి ఉన్న కండిషన్స్ ఏంటి? ఆ బుక్ తో వెంకటరమణ కష్టాలు తీరాయా? ఆ బుక్ లో వెంకటరమణ ఏం రాసాడు? ఆ బుక్ ఎవరెవరి చేతుల్లోకి మారి అందులో ఏమి రాశారు? ఆ బుక్ తో వెంకటరమణ, అతని కుటుంబం జీవితం ఎలా మారింది? వేంకటేశ్వరస్వామి మళ్ళీ కనిపిస్తాడా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Madhuraapuri Sadana Review : ‘మధురాపురి సదన’ మూవీ రివ్యూ.. తెలుగు ఓటీటీలో కొత్త సినిమా ఎలా ఉందంటే..?
సినిమా విశ్లేషణ.. ఒకప్పటి హీరోలు శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ కలిసి కనిపించడం, ఒకప్పటి హీరోయిన్ లయ నటించడం, రాజేంద్రప్రసాద్ మొదటిసారి వెంకటేశ్వరస్వామిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాని కామెడీ సినిమాల దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి ఆయన పాత స్టైల్ లోనే తెరకెక్కించారు. ఓపెనింగ్ తోనే వెంకటరమణ కష్టాలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి చూపించి కాస్త ఎమోషనల్ చేస్తారు. ఆ మిడిల్ క్లాస్ కష్టాలకు కనెక్ట్ అవ్వాల్సిందే. వేంకటేశ్వరస్వామి భూమి మీదకు వచ్చే గ్రాఫిక్స్ బాగుంటాయి. ఆయన ఇచ్చే నగలతో కాసేపు కామెడీ బాగానే నడిపించారు. ఆ తర్వాత బుక్ ఇచ్చిన దగ్గర్నుంచి కథ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది.
ఆ బుక్ తోనే ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పారు. ఇక సెకండ్ హాఫ్ అంతా ఆ బుక్ చేతులు మారడం, ఆ బుక్ లో రాసినవి జరగడం, మనిషి అత్యాశకు పోవడం, దేవుడి రాతనే మార్చాలని చూడటం, యముడి రావడం.. ఇలా కాస్త ఆసక్తిగా మనిషి ఆశ, అత్యాశ, ద్వేషం, బాధ, గర్వం.. లాంటి లక్షణాలు చూపిస్తూ రొటీన్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ సీన్స్ చాలా వరకు అనేక సినిమాల్లో ఉన్నవే. క్లైమాక్స్ ఊహించినట్టే ఎంత డబ్బు వచ్చినా వద్దు దేవుడికి ఎప్పుడు ఏం ఇవ్వాలో తెలుసు అనే రొటీన్ ఎండ్ ఇచ్చారు. క్లైమాక్స్ లో పార్ట్ 2 అధికారికంగా ప్రకటించకపోయినా లీడ్ ఇచ్చారు. క్లైమాక్స్ లో వెన్నెల కిషోర్ అఖండ స్పూఫ్ బాగుంటుంది.
గతంలో దేవుడు వచ్చి సహాయం చేయడం, ఏదైనా విలువైన దానికోసం కొంతమంది పోటీ పడటం కాన్సెప్ట్ లతో అనేక సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే కోవలోకి చెందింది. 2000 – 2010 మధ్య వచ్చే సినిమాల్లా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి, మిడిల్ క్లాస్ వ్యక్తులకు కనెక్ట్ అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది వేంకటేశ్వరస్వామిని నమ్ముతారు. ఆ భక్తులందరికీ ఇందులో చాలా సీన్స్ కనెక్ట్ అవుతాయి. సరదాగా కాసేపు ఫ్యామితో కలిసి చూడాలి అనుకుంటే ఈ సినిమా చూడొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
శ్రీకాంత్ మిడిల్ క్లాస్ వ్యక్తిగా బాధలతో సతమతమయ్యే పాత్రలో బాగానే నటించారు. లయ కూడా మిడిల్ క్లాస్ భార్య పాత్రలో ఒదిగిపోయింది. రాజేంద్రప్రసాద్ మొదటిసారి చేసినా వేంకటేశ్వరస్వామి పాత్రలో ఒదిగిపోయారు అని చెప్పొచ్చు. అలంకారం లేకుండా మాములు మనిషిగా వచ్చినా కూడా దేవుడే వచ్చాడు అని పాత దేవుళ్ళ సినిమాలు చూసిన ఫీల్ వస్తుంది రాజేంద్రప్రసాద్ పాత్రతో.
మురళీధర్ గౌడ్, అలీ, వెన్నెల కిషోర్ అక్కడక్కడా నవ్విస్తారు. ధనరాజ్ యముడి పాత్రలో సీరియస్ గా కనిపించి పర్వాలేదు అనిపించారు. సునీల్ చివర్లో విలన్ గా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి పర్వాలేదనిపించారు. రఘుబాబు, పృథ్వీ, కరుణా భూషణ్, భూపాల్,బాబు మోహన్, చైల్డ్ ఆర్టిస్టులు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Toxic : వాట్.. ‘టాక్సిక్’ అడల్ట్ సినిమా కాదా? బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ సినిమానా? యశ్ ఏం చెప్పాడంటే..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. వేంకటేశ్వరస్వామి పై రాసిన రెండు సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ పాటలు రిపీటెడ్ లో వినొచ్చు. దేవుడు,కర్మ పై రాసిన కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ షార్ప్ కట్ చేయాల్సింది. దేవుడు కనిపించి వరాలు ఇస్తే భక్తులు ఏం చేస్తారు అనే పాత కథతో కొత్త కథనంతో కామెడీ ఎమోషనల్ గా రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.
మొత్తంగా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమా ఓ మిడిల్ క్లాస్ వ్యక్తికి దేవుడు కనపడి ఓ వరం ఇస్తే ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అని కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఒక్కసారి సరదాగా చూడొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
