Vanda Devullu Review : ‘వంద దేవుళ్ళు’ మూవీ రివ్యూ.. తల్లికి రెండో పెళ్లి చేయాలనుకున్న కొడుకులు..
బిచ్చగాడు డైరెక్టర్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ మళ్ళీ సినిమా చేస్తున్నాడు అని తెలియడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. (Vanda Devullu Review)
Vanda Devullu Review
Vanda Devullu Review : విజయ్ ఆంటోని, శ్వాసిక, అజయ్ దిశన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వంద దేవుళ్ళు’. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజీ నిర్మాణంలో బిచ్చగాడు ఫేమ్ శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వంద దేవుళ్ళు జూన్ 19న తమిళ్, తెలుగులో రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే..
వాసవి(శ్వాసిక) భర్త చనిపోవడంతో ఇద్దరు చిన్న పిల్లలతో జీవిస్తుంది. తను కష్టపడుతూ పిల్లల్ని చదివిస్తుంది. వాసవి ఒంటరిగా ఉండటంతో ఊళ్ళో ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతూ ఉంటారు. తనకు కూడా అందరిలా బొట్టు, గాజులు, పువ్వులు పెట్టుకోవాలి అని ఉంటుంది కానీ వితంతువు అవన్నీ చేయకూడదు అని ఆగిపోతుంది. కొన్నేళ్ల తర్వాత తనకు ఒక జీవితం ఉంటె బాగుండు అని రెండో పెళ్లి ఆలోచన వస్తుంది. పెద్ద కొడుకు భాస్కర్(అజయ్ దిశన్) కాలేజీ చదివే సమయంలో ఇది తెలియడంతో అమ్మతో గొడవపడతాడు. ఇక ఆ విషయమే మర్చిపోతుంది వాసవి.
కొన్నేళ్ల తర్వాత భాస్కర్ లైఫ్ లో సెటిల్ అయ్యాక అమ్మకి రెండో పెళ్లి చెయ్యడం కరెక్ట్ అని ఆలోచిస్తాడు. వాసవి మొదట నో చెప్పినా భాస్కర్ పెళ్లి చేసుకుంటే, వాళ్ళింట్లో తన రెండో పెళ్ళికి ఒప్పుకుంటే నాకు ఓకే అని చెప్తుంది. వాసవి చిన్నకొడుకు వివేక్ కూడా మొదట నో చెప్పినా తర్వాత అర్ధం చేసుకుంటాడు. కానీ తన తల్లి పెళ్లి వల్ల వివేక్ ప్రేమ ఇబ్బందుల్లో పడుతుంది. మరి భాస్కర్, వివేక్ లు కలిసి తల్లికి మళ్ళీ పెళ్లి చేశారా? ఏడుకొండలు(విజయ్ ఆంటోనీ) వాసవి లైఫ్ లోకి ఎలా వస్తాడు? భాస్కర్ పెళ్లి, వివేక్ ప్రేమ ఏమవుతాయి? వాసవి రెండో పెళ్లిని వ్యతిరేకించిన ఊరి వాళ్ళు ఏం చేసారు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
సినిమా విశ్లేషణ..
బిచ్చగాడు డైరెక్టర్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ మళ్ళీ సినిమా చేస్తున్నాడు అని తెలియడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ట్రైలర్ లోనే ఓ మహిళ రెండో పెళ్లి గురించి కథ అని హింట్ ఇచ్చారు. ఈ సినిమా రియల్ లైఫ్ లో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించడం గమనార్హం.
ఫస్ట్ హాఫ్ అంతా వాసవి లైఫ్, పిల్లల్ని పెంచడం, రెండో పెళ్లి గురించి ఆలోచించడం, ఇద్దరు కొడుకులు కలిసి రెండో పెళ్ళికి తల్లిని ఒప్పించడంతో సాగుతుంది. ఇంటర్వెల్ కి కొడుకులకు దూరంగా వెళ్లిపోదామనుకున్న వాసవి అనుకోకుండా ఓ బావిలో పడుతుంది. దీంతో సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఏడుకొండలు ఎంట్రీ, వాసవితో పరిచయం, వాళ్ళ పెళ్ళికి కొడుకులు ప్లాన్ చేయడం, దాన్ని ఊరంతా వ్యతిరేకించడం, క్లైమాక్స్ లో ఎలా పెళ్లి చేసారు అని ఆసక్తిగా సాగుతుంది. లాస్ట్ అరగంట మాత్రం ఉత్కంఠగా, క్లైమాక్స్ కామెడీగా సాగుతుంది. హీరో విజయ్ ఆంటోనీ పాత్ర సెకండ్ హాఫ్ లో ఎంటర్ అవ్వడం గమనార్హం. ఈ పాత్ర జస్ట్ గెస్ట్ అప్పీరెన్స్ లానే ఉంటుంది. ఈ సినిమాకు హీరోలు అంటే శ్వాసిక, అజయ్ దిశన్ అనే చెప్పుకోవాలి.
వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, వారికంటూ ఓ జీవితం ఉండాలి, పిల్లలు ఒంటరిగా ఉండే తల్లి గురించి ఆలోచించాలి అనే పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇంకా కొన్ని ఊళ్ళల్లో ఆడవాళ్లను ఎలా చూస్తున్నారు, వితంతువులు, ఒంటరి మహిళలు ఎన్ని ఇబ్బందులు పడతారు, ఎంత కష్టపడతారు అని చూపించారు. సొంత వాళ్ళు కూడా ఎలా చూస్తారు అనే పాయింట్ మాత్రం బాగా చూపించారు.
ఫస్ట్ హాఫ్ బాగా సాగదీశారు. ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా ఆసక్తిగా మారుతుంది. అక్కడక్కడా కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఏడు కొండలు – వాసవి పాత్రల మధ్య లైఫ్ లో సెకండ్ లైఫ్ ని క్యూట్ గా చూపించారు. తల్లి ఎమోషన్ ఇంకాస్త బాగా పండించాల్సింది. వాసవి పాత్ర కాసేపు తల్లి బాధపడే ఎమోషన్, కాసేపు తన లైఫ్, రెండో పెళ్లి గురించి అనగానే సిగ్గు పడటం.. ఇలా ఎమోషన్స్ వెంటవెంటనే మార్చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. గతంలో ఈవీవీ తీసిన మా నాన్నకు పెళ్లి సినిమా అక్కడక్కడా గుర్తొస్తుంది. వాసవి రెండో పెళ్లి, పెద్ద కొడుక్కు పెళ్లికి సరైన ఎండ్ ఇచ్చినా చిన్న కొడుకు లవ్ స్టోరీకి ఎండ్ ఇవ్వకుండా ముగించేశారు. అది కూడా ఒక ముగింపు ఇచ్చి ఉంటె ఇంకా బాగుండేది. ఇక క్లైమాక్స్ లో రియల్ లైఫ్ వాసవి – ఏడుకొండలు, వాళ్ళ ఇద్దరు కొడుకుల ఫోటో వేయడం గమనార్హం. బిచ్చగాడు డైరెక్టర్ – హీరో అనడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి కానీ అంచనాలను ఆ అందుకోలేదు అనే చెప్పాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్..
శ్వాసిక మాత్రం తల్లి పాత్రలో అదరగొట్టేసింది చెప్పొచ్చు. ఆ పాత్రలో బాధ, సంతోషం, సిగ్గు.. ఒక వితంతువుగా అన్ని రకాల ఎమోషన్స్ ని బాగా పండించింది. అజయ్ దిశన్ పెద్ద కొడుకు పాత్రలో బాగానే నటించాడు. విజయ్ ఆంటోనీ కూడా వయసు మళ్ళిన పాత్రలో, రెండో పెళ్లి చేసుకునే పాత్రలో చక్కగా నటించారు. కావ్య అనిల్ అక్కడక్కడా కనిపించి మెరిపించింది. నెగిటివ్ షేడ్స్ లో బాలాజీ శక్తివేల్ బాగా నటించారు. లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, అరుళ్ దాస్, పదిని కుమార్, వినోదిని.. పలువురు నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
Also Read : Maa Inti Bangaram First Review : ‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ రివ్యూ.. సమంత సినిమా టాక్ ఏంటి?
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. పాటలు మాత్రం బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కొన్ని చోట్ల సరిగ్గా కుదరలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేయాల్సింది. రియల్ లైఫ్ లో జరిగిన సంఘటన తీసుకొని కొత్త పాయింట్ తో దర్శకుడు బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘వంద దేవుళ్ళు’ సినిమా తల్లికి రెండో పెళ్లి చేయాలనుకునే కొడుకులు, ఆ క్రమంలో జరిగిన సంఘటనలతో రియల్ లైఫ్ లో జరిగిన ఓ పెళ్లిని ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
