Makutam Review: ‘మకుటం’ మూవీ రివ్యూ.. విశాల్ రెండు పాత్రల్లో మెప్పించాడా?
Makutam Movie Review: ఇలాంటి సినిమాని విశాల్ డైరెక్ట్ చేయడం గమనార్హం.
Vishal Makutam Review
Makutam Review: విశాల్ హీరోగా నటిస్తూనే దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా ‘మకుటం’. అంజలి, దుషార విజయన్ లు హీరోయిన్స్ గా నటించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై స్వర్గీయ ఆర్.బీ.చౌదరి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. మకుటం సినిమా నేడు ఆగస్ట్ 14న తమిళ్, తెలుగులో రిలీజయింది.
కథ విషయానికొస్తే..
కృపాకర్(విశాల్) ఓ మెడికల్ సేల్స్ పర్సన్. ప్రేమించిన అమ్మాయి జమున(దుషార విజయన్)ని పెళ్లి చేసుకొని, తన ఇద్దరు పిల్లలతో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కష్టంగా నెట్టుకొస్తాడు. అన్ని అవమానాలను తట్టుకుంటూ లైఫ్ ని వెళ్లదీస్తూ ఉంటాడు. జమున తండ్రికి కార్ ఉందని చెప్పి పెళ్లి చేసుకోవడంతో సొంత కార్ కోసం అష్టకష్టాలు పడతాడు. ఎలాగోలా చివరకు ఓ సెకండ్ హ్యాండ్ కార్ ని కొంటాడు కృపాకర్.
కానీ ఆ కార్ లో ఊటీకి వెళ్లడంతో వీళ్లపై అటాక్ జరిగి జమున, కృపాకర్ కూతురు చనిపోతుంది. ఈ అటాక్ ని వైజాగ్ హార్బర్ ని కంట్రోల్ లో పెట్టుకున్న లోకల్ డాన్ లింగ(విశాల్) శత్రువు అయిన నాగ(అజయ్) చేయిస్తాడు. అసలు నాగ కృపాకర్ మీద ఎందుకు అటాక్ చేస్తాడు? లింగ – కృపాకర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? లింగ ఫ్లాష్ బ్యాక్ ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Vishwanath and Sons Review : ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ రివ్యూ.. సూర్య సినిమానే కానీ మమిత బైజు వన్ వుమెన్ షో..
సినిమా విశ్లేషణ..
విశాల్ ఫలితాలతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. గతంలో మంచి సినిమాలు చాలా చేసినా మధ్యమధ్యలో రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసి చేతులు కాల్చుకుంటాడు విశాల్. ఈ సినిమా కూడా అంతే. ట్రైలర్, టీజర్స్ తో సినిమాపై ఆసక్తి కలిగించినా సినిమాలో మాత్రం ఆ ఆసక్తి కలిగించే అంశం ఒక్కటి కూడా లేదు.
ఫస్ట్ హాఫ్ కృపాకర్ పాత్ర పరిచయం, అతను కార్ కొనడానికి పడే కష్టాలు, తన ఫ్యామిలీ సీన్స్, తన పెళ్లి ఫ్లాష్ బ్యాక్ తో బాగా సాగదీశారు. కార్ పై అటాక్ జరగడంతో ఇంటర్వెల్ కి ఓ బ్యాంగ్ ఇచ్చినా సెకండ్ హాఫ్ కథ ఏంటి అనేది ఈజీగా ఊహించేయొచ్చు. ఇక సెకండ్ హాఫ్ లో లింగ ఎలా ఎదిగాడు? లింగ లవ్ స్టోరీతో సాగదీసి చివర్లో రెండు ఫైట్స్, ఓ ఎమోషనల్ సీన్స్ తో ముగించారు.
ఈ కథ, కథనం చాలా పాతది. తండ్రి ఓ డాన్ అతనికి దూరంగా బతికే కొడుకు, తండ్రిని అపార్థం చేసుకునే కొడుకు, విలన్స్ కొడుకు మీదకు రావడం, తండ్రి పగా తీర్చుకోవడం, తండ్రి ఎలా డాన్ గా ఎదిగాడు అనే ఫ్లాష్ బ్యాక్.. ఇలా రొటీన్ కథ. కొన్ని వందల సినిమాల్లో ఈ కథ ఉంది. ఇక సాగదీయడానికి కార్ కొనే సీన్స్, లవ్ స్టోరీ సీన్స్ సరిపోయాయి. కాకపోతే ఈ సినిమాలో వెహికల్స్ కి వాడే డూప్లికేట్ స్పేర్ పార్ట్స్, వాటి బిజినెస్, వాటి వల్ల జరిగే నష్టాలు అనే మెసేజ్ అయితే ఇచ్చారు. చివర్లో తండ్రి చనిపోతే కొడుకు లీడ్ తీసుకోవడం కూడా రొటీన్ పాత లైన్.
కథలు రొటీన్ గా వచ్చినా కథనం అయినా కొత్తగా రాసుకుంటారు. కానీ ఈ సినిమాలో కథనం కూడా పాతదే. ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే రెండు యాక్షన్ సీన్స్ మాత్రం కొత్తగా బాగున్నాయి. ఇళయరాజా సాంగ్ తో ఫైట్ సీక్వెన్స్, మహిళలతో యాక్షన్ సీక్వెన్స్ లు మెప్పిస్తాయి. హీరో మిడిల్ క్లాస్ అనే ఎమోషన్ ని ఫస్ట్ హాఫ్ లో చూపించే ప్రయత్నం చేసాడు కానీ అది సరిగా పండలేదు. సినిమా మొదట్లో ఓ అనాథని చూపించడం, అతను లైఫ్ లో ఎదగాలనుకోవడం అనే లీడ్ ఇచ్చి అసలు లింగ ఎలా డాన్ అయ్యాడు అనేది పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు. సింపుల్ గా ఓ రెండు సీన్స్ తో లింగ డాన్ అయిపోతాడు. క్లైమాక్స్ లో అధికారికంగా ప్రకటించకపోయినా పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం. ఒక రొటీన్ కమర్షియల్ సినిమా చాలా సహనంగా చూడాలి. ఇలాంటి సినిమాని విశాల్ డైరెక్ట్ చేయడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్..
విశాల్ అయితే రెండు పాత్రల్లో తండ్రికొడుకుగా బాగానే నటించి మెప్పించాడు. మంచి పాత్రల్లో నటించే దుషార విజయన్ కు ఈ సినిమాలో నటించే అంత స్కోప్ లేదు. అంజలి పర్వాలేదనిపిస్తుంది. జాన్ విజయ్ బాగానే నటించాడు. జేయప్రకాష్, అజయ్, అబూ సలీమ్, పదం కుమార్.. మిగిలిన తమిళ నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు. తెలుగు నటి, యాంకర్ ఝాన్సీ అంజలి పక్కనే ఉండే ఏ మాత్రం స్కోప్ లేని పాత్రలో ఎందుకు నటించిందో ఆమెకే తెలియాలి.
Also Read : Hushar Pittalu Review: ‘హుషార్ పిట్టలు’ మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో నవ్వించి..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రమే. ఒక్క పాట కూడా బాగోలేదు. ఎడిటింగ్ లో చాలా ల్యాగ్ సీన్స్ కట్ చేయాలి. రొటీన్ కమర్షియల్ కథ కథనంతో తెరకెక్కించాడు దర్శకుడు విశాల్. కథ, కథనం పేలవంగా ఉన్నా సాంకేతికంగా మాత్రం బాగానే డీల్ చేసాడు విశాల్. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘మకుటం’ తండ్రి కొడుకు ఎమోషన్ తో ఓ డాన్ సెటప్ తో మెసేజ్ ఇచ్చిన సినిమా. ఈ సినిమాకు 2 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ &రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
