Plastic Bag Red Carpet : సాదాసీదా కవర్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఈ ప్లాస్టిక్ బ్యాగ్ ఖరీదు అక్షరాలా రూ. 1.5 లక్షలు..?
Plastic Bag Red Carpet : చేతిలో ప్లాస్టిక్ కవర్ పట్టుకుని రెడ్ కార్పెట్ మీద ఫోజులిచ్చిన ఓ నటి ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఎందుకంటే..
- Dharani Pilli
- Published On : March 14, 2026 / 06:34 PM IST
China actress Zhang Jingyi walked red carpet with plastic bag photo went viral
Plastic Bag Red Carpet : ప్లాస్టిక్‌ని బ్యాన్ చేయమని మన ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు, సెలబ్రిటీలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలంటూ ప్రచారం చేస్తున్నారు. అలానే మాల్స్, దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లను డబ్బులకు అమ్ముతున్నారు. ఇలా అయితేనన్నా కొనకుండా ఉంటారనే ఉద్దేశంతో. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు దాన్ని కూడా అమ్ముతుంటే.. ఓ నటి మాత్రం ఏకంగా లక్షన్నర పెట్టి ప్లాస్టిక్ కవర్ కొన్నది. పైగా దాన్ని పట్టుకుని రెడ్ కార్పెట్ మీద ఫోజులివ్వడంతో రాత్రికి రాత్రే ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.
చైనా నటి జాంగ్ జింగ్‌యి తాజాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. కారణం ఏమిటంటే, ఆమె 2025 బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై నడిచినప్పుడు తీసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వాటిల్లో అందరినీ ఆకర్షిస్తోంది ఆ నటి వేసుకున్న డ్రెస్, నగలు, ఆమె బ్యూటీ కాదు. ఆమె చేతిలో పట్టుకున్న పసుపు రంగు ప్లాస్టిక్ కవర్ బ్యాగ్. సాధారణంగా కిరాణా సరుకులు తీసుకెళ్లడానికి లేదా చెత్త వేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ బ్యాగ్‌ని.. ఆమె పర్స్, బ్యాగ్‌లా ధరించి రెడ్ కార్పెట్ మీదకు తీసుకురావడంతో అది ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది.
ఈ ఫోటో చూసిన నెటిజనులు.. ఆ ప్లాస్టిక్ బ్యాగ్ నిజానికి లగ్జరీ బ్రాండ్ బలెన్సియాగా డిజైన్ అని ప్రచారం చేయడం ప్రారంభించారు. మరికొందరు అయితే ఆ బ్యాగ్ ధర సుమారు 1,790 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 1,65,647) ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. లక్షన్నర పెట్టి ప్లాస్టిక్ కవర్ కొన్నావా అంటూ నెటిజనులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం నిజం కాదని తెలిసింది.
సదరు నటి చేతిలో పట్టుకున్నది సాధారణ ప్లాస్టిక్ కవర్ మాత్రమే. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె దాన్ని పట్టుకుని వచ్చింది. జాంగ్ నటించిన “The One” అనే చిత్రంలోని తన పాత్రకు గుర్తుగా ఆమె చేతిలో ప్లాస్టిక్ కవర్ తో రెడ్ కార్పెట్ మీద ఫోజులిచ్చింది. ఆ సినిమాలో పసుపు రంగు ప్లాస్టిక్ కవర్.. జాంగ్ పాత్ర.. ఆమె వినికిడి లోపం ఉన్న తల్లిదండ్రుల మధ్య కమ్యూనికేషన్ సాధనంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అసలు విషయం తెలిసినా దీనిపై చర్చ ఆగడం లేదు. ఒక్క ఫోటోతో ఈ ప్లాస్టిక్ కవర్ ట్రెండింగ్‌లో నిలవడం మాత్రం విశేషం.
