Kangana Ranaut : 17 ఏళ్ళ తర్వాత తెలుగు సినిమాకు ఓకే చెప్పిన ప్రభాస్ హీరోయిన్..? ఆ దర్శకుడితో సినిమా..
తెలుగులో కంగనా రనౌత్ ప్రభాస్ తో ఏక్ నిరంజన్ సినిమా ఒక్కటే చేసింది. (Kangana Ranaut)
Kangana Ranaut
Kangana Ranaut : ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాలో తెలుగు వాళ్ళను పలకరించిన కంగనా రనౌత్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత తెలుగులో ఒక సినిమా ఓకే చేసిందని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో వరుస హిట్స్, అవార్డులు, వివాదాస్పద సినిమాలతో ఎపుడూ వార్తల్లో ఉండే నటి కంగనా రనౌత్. ఇప్పుడు బీజేపీ తరపున మండి ఎంపీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తుంది. ఓ పక్క తన మాటలతో, సోషల్ మీడియా పోస్టులతో వివాదాల్లో నిలుస్తూనే వరుస సినిమాలు చేస్తుంది కంగనా రనౌత్.
తెలుగులో కంగనా రనౌత్ ప్రభాస్ తో ఏక్ నిరంజన్ సినిమా ఒక్కటే చేసింది. 2009 లో రిలీజయిన ఈ సినిమా అప్పట్లో అంతగా ఆడలేదు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తెలుగులో దర్శకుడు రవిబాబు చెప్పిన ఒక కథకు ఓకే చెప్పిందని టాలీవుడ్ టాక్. మొదట్నుంచి కొత్త వాళ్ళు, చిన్న నటీనటులతోనే డిఫరెంట్ సినిమాలు తీస్తూ వస్తున్న రవిబాబు ఇటీవల కొన్ని పరాజయాలు చూసాడు.
తాజాగా రవిబాబు కంగనా రనౌత్ కి ఒక హారర్ కథ చెప్పాడట. అసలే రవిబాబు హారర్, థ్రిల్లర్ కథల్లో ఎక్స్పర్ట్. ఆ కథ కంగనా రనౌత్ కి నచ్చిందని చెప్పిందట. కానీ ఇంకా కంగనా ఈ సినిమా చేస్తానని ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదట. ఒకవేళ కంగనా రనౌత్ రవిబాబు దర్శకత్వంలో తెలుగులో హారర్ సినిమా చేస్తే ఆ సినిమాపై బజ్ ఏర్పడటం గ్యారెంటీ. ఆ సినిమా హిందీలో డబ్ అవ్వడం కూడా గ్యారెంటీ. మరి ఈ సినిమా పట్టాలెక్కుతుందా చూడాలి. ఇక కంగనా రనౌత్ చేతిలో ప్రస్తుతం సర్కిల్, క్వీన్ 2, తను వెడ్స్ మను 3 సినిమాలు ఉన్నాయి.
