కృష్ణం రాజుకు తమిళనాడు గవర్నర్ పదవి?
- Subhan Ali Shaik
- Updated on- January 7, 2021 / 04:20 PM IST
Rebel Star Krishnam Raju: బీజేపీ సీనియర్ నాయకుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు హైకమాండ్ పెద్ద పదవినే కట్టబెట్టనుందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు గవర్నర్ పదవిని అప్పగించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఇంకా కన్ఫర్మేషన్ కూడా అవలేదు.. ఈ లోపే బీజేపీ నేతకు అభినందనలు తెలుపుతూ ట్వీట్స్ చేసేస్తున్నారు. మరోవైపు ఈ వార్త తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో మునిగిపోయారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
1998లో కాకినాడ నుంచి లోక్‌సభకు ఎన్నికైన కృష్ణం రాజు.. 1999లో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. వివిధ కమిటీల్లో సభ్యుడిగా పని చేసిన ఆయన 2000 సంవత్సరంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణమ రాజు.. పార్టీ విలీనం తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండి మళ్లీ సొంతగూటికే చేరుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కృష్ణం రాజు.. శ్యామలా దేవిని పెళ్లాడారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో ఆయన జర్నలిస్టుగా పని చేశారు. 1966లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి కళారంగంలో సేవలు అందించారు.
2014లో కేంద్రంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణకు చెందిన విద్యాసాగర్ రావును మహారాష్ట్ర గవర్నర్‌గా ఎంపిక చేశారు. కొద్ది కాలంపాటు తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గానూ వ్యవహరించారు. మరో తెలుగు వాడైన బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.
