నితిన్ పెళ్లికొడుకు ఫంక్షన్‌లో పవర్‌స్టార్..

  • Publish Date - July 24, 2020 / 07:18 PM IST

టాలీవుడ్ యువ హీరో నితిన్ పెళ్లి సందడి షురూ అయింది. ఐదు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న పెళ్లి వేడుకలు జూలై 22 నుండి మొద‌ల‌య్యాయి. బుధ‌వారం హైద‌రాబాద్‌లో నితిన్ షాలినిల కుటుంబ పెద్ద‌లు తాంబూళాలు మార్చుకుని నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. ప‌రిమిత అతిథుల మ‌ధ్య ఇరు కుటుంబాల స‌మ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.ఎంగేజ్‌మెంట్‌తో ప్రారంభ‌మైన ఐదు రోజుల పెళ్లి సంబ‌రాలు ఆసాంతం కోవిడ్ నిబంధ‌న‌లు అనుస‌రిస్తూనే జ‌ర‌గ‌నున్నాయి. తాజాగా జరిగిన నితిన్, షాలినీల మెహందీ ఫంక్షన్( పెళ్లికొడుకు ఫంక్షన్‌) కి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. తన అభిమాన హీరో రాకతో నితిన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

చాతుర్మాస దీక్షలో ఉన్న పవన్ చేనేత వస్త్రాలు, నుదుట బొట్టుతో సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. పవన్ వెంట త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధకృష్ణ(చినబాబు), సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా పవన్, త్రివిక్రమ్, చినబాబులకు థ్యాంక్స్ తెలుపుతూ నితిన్ ట్వీట్ చేశారు. డిజైనర్ నీరజ కోన నితిన్, షాలినీలతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నెల 26న రాత్రి ఎనిమిది గంట‌ల ముప్పై నిమిషాల‌కు షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నారు నితిన్.