Prakash Raj : ప్రకాశ్ రాజ్ ఇంట విషాదం.. సంతాపం తెలిపిన AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్
Prakash Raj : ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
- Dharani Pilli
- Published On : March 30, 2026 / 04:22 PM IST
prakash raj mother passed away ap dy cm pawan kalyan and ys jagan expresses condolences
Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సువర్ణలత (86) మరణించారు. గత కొన్ని రోజులుగా వయోభార సమస్యలతో బాధపడుతున్న ఆమె నేడు తుది శ్వాస విడిచారు. సోమవారం ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు. నేటి సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రకాశ్ రాజ్ తల్లి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్.. ప్రకాశ్ రాజ్ తల్లి మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. “ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మాతృమూర్తి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసింది. ఈ వార్త నన్ను ఎంతో కలచివేసింది. ఆమె మృతి పట్ల నేను చింతించాను. శ్రీమతి సువర్ణలత గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తల్లి చనిపోయి తీవ్ర దుఃఖంలో ఉన్న ప్రకాశ్ రాజ్ కి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ ఎక్స్ (X) వేదికగా పవన్ పోస్ట్ చేశారు.
ప్రముఖ నటుడు శ్రీ @prakashraaj గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సువర్ణలత గారు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగానికి లోనైన శ్రీ ప్రకాష్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 30, 2026
ప్రకాశ్ రాజ్ తల్లి మృతి పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రకాశ్ రాజ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు జగన్ సానుభూతి తెలిపారు. ఈ విషాదం నుంచి కోలుకునేందుకు గాను భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ప్రకాశ్ రాజ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ నటుడిగా కొనసాగుతున్నారు. కన్నడకు చెందిన ప్రకాశ్ రాజ్ తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ హీరోగా వస్తున్న ‘స్పిరిట్’ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
