Harish Rana : దేశంలోనే తొలి కారుణ్య మరణం.. ఆస్పత్రిలో హరీశ్ రానా చివరి వీడియో..!

Harish Rana : దేశంలోని తొలి సారి సుప్రీం కోర్టు నుంచి కారుణ్య మరణానికి అనుమతి పొందిన హరీష్ రానాకు సంబంధించిన చివరి వీడియో వైరల్ అవుతోంది.

after supreme court verdict harish rana moved to delhi aiims for euthanasia video went viral

గత 13 ఏళ్లుగా కోమాలో బాధపడుతున్న 31 ఏళ్ల హరీష్ రానాను కారుణ్య మరణానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఘజియాబాద్‌లో ఉంటున్న హరీష్ రానాను.. ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) కి తరలించారు. హరీష్ రానా తల్లిదండ్రులు అత్యంత రహస్యంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. దీని గురించి పొరుగువారికి, సొసైటీ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. శనివారం హరీష్ రానాను ఘజియాబాద్‌లోని తన ఫ్లాట్ నుండి ఎయిమ్స్ కు చేర్చారు. ఈ సమయంలో అతడి సోదరి, బావమరిది, తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. ప్రత్యేక వాహనంలో హరీష్ రానాను తరలించారు.

హరీష్ రానాను తరలించే ముందు బ్రహ్మ కుమారీలకు చెందిన ఓ దీదీ వారి ఇంటికి వచ్చారు. హరీష్ తల మీద చేయి వేసి నిమురుతూ.. అందరినీ క్షమించి.. అందరికీ క్షమాపణలు చెప్పి వెళ్లు అని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 31 ఏళ్ల వయసులో మరణానికి చేరువవుతున్న హరీష్ రానా ముఖం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు.

వైద్య నిపుణుల ప్రకారం, హరీష్ రానాను ఎయిమ్స్ లోని పాలియేటివ్ కేర్ యూనిట్‌కు తరలించే అవకాశం ఉంది. పాలియేటివ్ కేర్ అంటే తీవ్రమైన, చివరి దశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సౌకర్యం, గౌరవంతో జీవించేందుకు సహాయం చేసే వైద్య విధానం. ఈ విభాగంలో డాక్టర్లు జీవితం ఎక్కువ కాలం కొనసాగించడానికి తీవ్రమైన చికిత్సలు చేయరు. దాని బదులుగా, రోగి బాధను తగ్గించడం పై దృష్టి పెడతారు.

ఎయిమ్స్ లోని పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ విభాగానికి మాజీ అధిపతి అయిన డాక్టర్ సుష్మా భట్నాగర్ ఇలాంటి కేసులను ఎలా ట్రీట్ చేస్తారో వివరించారు:

  1. పాలియేటివ్ కేర్‌లో డాక్టర్లు రోగిని సహజంగా మరణించేందుకు అనుమతిస్తారు.
  2. వారు జీవితాన్ని కృత్రిమంగా పొడిగించరు.
  3. అలాగే ఉద్దేశపూర్వకంగా మరణాన్ని వేగవంతం చేయరు.
  4. ఇలాంటి రోగులకు మాత్రం ప్రాథమిక వైద్య సేవలు కొనసాగుతాయి.

ఉదాహరణకు:

  • నొప్పి నియంత్రణ
  • శుభ్రత, నర్సింగ్ సేవలు
  • సౌకర్యం కోసం అవసరమైన మందులు
  • భావోద్వేగ పరమైన మద్దతు

అయితే ఇలాంటి రోగులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) కు మార్చడం లేదా తీవ్రమైన చికిత్సలు అందించడం చేయరు.