Earthquake Today : పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
Earthquake Today : మంగళవారం తెల్లవారుజామున ఈశాన్య రాష్ట్రాలను భూకంపం వణికించింది.
- Dharani Pilli
- Updated on- April 21, 2026 / 10:51 AM IST
assam manipur earthquake northeastern states april 2026
- ఈశాన్య రాష్ట్రాలను ఒణించికన భూకంపం
- అస్సాం, మణిపూర్ ప్రాంతాల్లో భూప్రకంపనలు
- ఏప్రిలో రెండో సారి ఈ రాష్ట్రాల్లో భూకంపం
Earthquake Today : ఈశాన్య రాష్ట్రాల ప్రజలను భూప్రకంపనలు మరోసారి వణికించాయి. ఏప్రిల్ 21, మంగళవారం ఉదయం 5:59 గంటల ప్రాంతంలో మణిపూర్ సహా నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో గాఢనిద్రలో ఉన్న ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ ప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం మణిపూర్‌లోని కమ్‌జోంగ్ (Kamjong) జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. భూప్రకంపనలు బలంగా ఉండటంతో ప్రజలు నిద్రలోనే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. ప్రాణభయంతో జనం రోడ్లపైకి రావడంతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొంది.
అటు అస్సాంలోని గువహటి, దాని పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు జనాలను భయభ్రాంతులకు గురి చేశాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. అయినప్పటికీ అధికారులు అప్రమత్తమయ్యారు.
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) నివేదిక ప్రకారం.. ఈ భూకంపం భూగర్భంలో సుమారు 62 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. భూకంప తీవ్రత మధ్యస్థంగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పిందని విశ్లేషిస్తున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో భూకంపం సంభవించడం ఇది రెండోసారి. ఈ నెల 7వ తేదీన మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3, 3.0గా నమోదైంది. ఏప్రిల్ నెలలోనే రెండు వరుస భూప్రకంపనలతో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
జపాన్‌లో భారీ భూకంపం సంభవించిన కొన్ని గంటల్లోనే మణిపూర్‌లో ఈ ప్రకంపనలు రావడం గమనార్హం. ఉత్తర జపాన్‌లో సోమవారం 7.7 తీవ్రతతో వచ్చిన శక్తివంతమైన భూకంపం కారణంగా అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.. భూకంపం వచ్చిన 40 నిమిషాల తర్వాత ఇవాటే (Iwate) లోని కుజీ (Kuji) నౌకాశ్రయాన్ని సుమారు 80 సెంటీమీటర్ల (31 అంగుళాలు) ఎత్తులో సునామీ అలలు తాకినట్లు జపాన్ వాతావరణ సంస్థ (JMA) ధృవీకరించింది. నేడు ఇండియాలో భూకంపం రావడంతో జనాలు తీవ్రంగా భయపడ్డారు.
