RC Cancellation: పాత వాహనం ఇచ్చేశాక.. ఆర్సీ రద్దు తప్పనిసరి.. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవు
పాత వాహనాలను తుక్కుగా మార్చిన తర్వాత, ఆ వాహనానికి సంబందించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దు(RC Cancellation) చేయించడం తప్పనిసరి
- పాత వాహనాల ఆర్సీ రద్దు తప్పనిసరి.
- లేదంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయి.
- రద్దు చేస్తే రాయితీలు లభిస్తాయి.
RC Cancellation: పాత వాహనాలను తుక్కుగా (స్క్రాప్) మార్చిన తర్వాత, ఆ వాహనానికి సంబందించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) రద్దు(RC Cancellation) చేయించడం తప్పనిసరి అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ స్పష్టం చేసింది. వాయు కాలుష్య నియంత్రణ, రహదారి భద్రత లక్ష్యంగా కేంద్రం ఈ వాహన స్క్రాపేజ్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలకు, 15 ఏళ్లు నిండిన వాణిజ్య వాహనాలకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో ఫిట్నెస్ పరీక్ష తప్పనిసరి. ఈ పరీక్షలో విఫలమైనా లేదా 15 ఏళ్లు నిండిన ప్రభుత్వ వాహనాలైనా.. వాటిని అధికారిక ‘రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ’ (ఆర్వీఎస్ఎఫ్) కేంద్రాల్లోనే తుక్కుగా మార్చాలి.
నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే ముప్పులు:
పాత వాహనాన్ని అనధికారికంగా ఏదో ఒక గ్యారేజీలో స్క్రాప్ కింద వేసి వదిలేస్తే భవిష్యత్తులో న్యాయ, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్సీ రద్దు చేయకపోతే ఆ వాహనం చట్టపరంగా పాత యజమాని పేరుతోనే కొనసాగుతుంది. ఒకవేళ నేరస్థులు ఆ వాహన ఇంజిన్, ఛాసిస్ నంబర్లను దుర్వినియోగం చేసి నకిలీ వాహనాలు సృష్టించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరంగా పాత యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఆ వాహనంపై వచ్చే ట్రాఫిక్ చలాన్లు, పెండింగ్ పన్నుల నోటీసులు నేరుగా యజమాని ఇంటికే వస్తాయి.
ఆర్సీ రద్దు ప్రక్రియ, ప్రయోజనాలు:
క్రమపద్ధతిలో వాహనాన్ని స్క్రాప్ చేసి, ఆర్టీఓ కార్యాలయంలో ఒరిజినల్ ఆర్సీ, స్క్రాపింగ్ కేంద్రం ఇచ్చిన ‘సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్’ పత్రాలతో ఫారం-26 ద్వారా దరఖాస్తు చేసుకుంటే అధికారులు ఆర్సీని అధికారికంగా రద్దు చేస్తారు. ఇలా సరైన పద్ధతిలో ఆర్సీ రద్దు చేసుకున్న వారికి ప్రభుత్వం, ఆటోమొబైల్ సంస్థలు పలు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. కొత్త వాహనం కొనుగోలుపై రిజిస్ట్రేషన్ ఫీజు పూర్తిగా మాఫీ అవ్వడమే కాకుండా, రోడ్డు పన్నులో 25 శాతం వరకు రాయితీ లభిస్తుంది. అలాగే కార్ల తయారీ సంస్థలు ఎక్స్-షోరూమ్ ధరపై 1.5% నుండి 3% వరకు ప్రత్యేక తగ్గింపులను అందిస్తాయి.
