పౌరసత్వపు బిల్లుపై సుప్రీం కోర్టుకెక్కిన కాంగ్రెస్
- Subhan Ali Shaik
- Published On : December 12, 2019 / 12:14 PM IST
పౌరసత్వపు బిల్లుపై కాంగ్రెస్ సుప్రీం కోర్టుకెక్కింది. బీజేపీ ప్రతిపాదించిన బిల్లుకు ఛాలెంజ్ చేస్తూ సవాల్ విసిరింది. ఇదే బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతుండటంతో బిల్లును వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.
బుధవారం(డిసెంబర్11, 2019) రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చాయి. అంతకముందు లోక్ సభలో బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందింది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, క్రిస్టియన్, పార్శీ, జైన్, బౌద్ధ, సిక్కు మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు CAB.
పౌరసత్వ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లింల హక్కులకు విఘాతం కలుగుతుందని వాపోతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ వచ్చిన భారత మూల సిద్ధాంతాలకు ఈ పౌరసత్వ సవరణ బిల్లు గొడ్డలి పెట్టుగా పరిణమిస్తుందని విపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి. విభజించి పాలించు అనే విధానానికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసినట్టుగా అనిపిస్తోందని అభిప్రాయపడ్డాయి.
