Disha Salian : దిశా సాలియన్ కేసులో బిగ్ ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు..
Disha Salian Case : దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలిమాన్ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Disha Salian Case
Disha Salian Case : దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలిమాన్ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సారంగ్ కొత్వాల్, జస్టిస్ రంజిత్ సిన్హా రాజా భోంస్లే ధర్మాసనం 44 పేజీల తీర్పును వెలువరించింది. కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకు కోర్టు అప్పగించింది.
Also Read : Narendra Modi Swadeshi : మోదీ చెప్పినట్టు బంగారం కొనడం, ఫారెన్లో పెళ్లిళ్లు మానేస్తే నిజంగా లాభమా?
2020 జూన్ 8న ముంబయిలోని మలాడ్లో ఓ భవనం 14వ అంతస్తు నుంచి దిశా సాలియన్ కిందపడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ తరువాత వారం రోజులకే సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన ఇంట్లో మరణించడంతో ఈ రెండు ఘటనల మధ్య ఏదో సంబంధం ఉందంటూ తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే, దిశా సాలియన్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి సతీశ్ సాలియన్ గత ఏడాది బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానం ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు.
దిశా సాలియన్ మృతి కేసుపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోర్టు సూచించింది. దర్యాప్తులో తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితుడిగా పరిగణించరాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సతీశ్ సాలియాన్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది.
ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని.. గత ఆరేళ్లుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ప్రమాదవశాత్తు మరణంగా ఎలా పరిగణిస్తారని పోలీసులను ప్రశ్నించింది. వారి దర్యాప్తు తీరు చూస్తుంటే సమాధానాల కన్నా ఎక్కువ సందేహాలే వ్యక్తమవుతున్నాయని కోర్టు ఆక్షేపించింది.
అయితే, తాజాగా దిశా సాలియన్ మృతి కేసును బాంబే హైకోర్టు సీబీఐకు అప్పగించడంతో ఆరేళ్లుగా కొనసాగుతున్న కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దిశా, సుశాంత్ మరణాల మధ్య నిజంగా ఏదైనా సంబంధం ఉందా? లేదంటే రెండు ఘటనలు వేరువేరా? అనే అంశాలు సీబీఐ దర్యాప్తులో తేలాల్సి ఉంది.
