హాట్సాఫ్ పోలీస్ : CAA గురించి వివరించిన SSP

  • Publish Date - December 22, 2019 / 08:13 AM IST

పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. యూపీలో 16 మంది చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగుతోంది. రాళ్లతో పోలీసులపైకి దాడులకు తెగబడుతున్నారు నిరసన కారులు. పలువురు పోలీసులకు గాయాలవుతున్నాయి.

రక్తమోడుతోనే విధులు నిర్వహిస్తున్నారు. అయితే..కొంతమంది ఆందోళనకారులను శాంతింప చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వీరు చేస్తున్న ప్రయత్నాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఓ పోలీసు ఇచ్చిన స్పీచ్, సారే జహాసే అచ్చా..అంటూ పాటకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయ్యింది. తాజాగా మరో పోలీసుకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. 

జనాల్లో CAAపై ఉన్న అపోహాలను పొగొట్టే ప్రయత్నం చేశాడు. యూపీలో ఇటావాలో ఎస్ ఎస్పీ సంతోష్ మిశ్రా ముస్లిం సోదరులను కలిశారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితాల గురించి వివరించారు. దీనివల్ల ఎదురయ్యే లాభ, నష్టాలను అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఎవరూ ఎక్కడకు పోరు..ఎందుకు వెళుతారు..ఇక్కడే ఉంటారు..ఇక్కడే చదువుకుంటారు..కలిసి ప్రార్థనలు చేసుకుంటారని తెలిపారు. బిల్లుపై వచ్చే పుకార్లను నమ్మొద్దని సూచించారు.

Read More : కేంద్ర మద్దతుపై ఆలోచించండి..జగన్ సాబ్ – ఓవైసీ
చట్టాన్ని మాత్రమే నమ్మాలన్నారు. సీఏఏ వల్ల ఎలాంటి నష్టం ఉండదని, ఇతర దేశాల నుంచి ఇండియాలోకి వచ్చే వాళ్ల గురించి మాత్రమే ఈ చట్టం చెబుతోందన్నారు. దయచేసి అందరూ శాంతియుతంగా..సామరస్యంగా మెలగాలన్నారు. దీనిని ఓ వ్యక్తి సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. బాలా అనే వ్యక్తి పేరిట ఉన్న ట్విట్టర్‌లో పోస్టు అయ్యింది. పోలీసులంటే ఇలా ఉంటారు..ప్రజలకు హానీ చేయరు..అంటూ ట్వీట్‌లో తెలిపారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటూ కితాబిస్తున్నారు.