TVK Vijay : తమిళనాడులో టీవీకే జోరు.. విజయ్ విజయానికి ప్రధాన కారణం వీళ్లే..
TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ విజయం దిశగా దూసుకుపోతుంది. విజయ్ గెలుపుకి ప్రధాన కారణాలు ఏంటంటే...
Gen Z Plays Key Role for Vijay TVK Victory in Tamil Nadu Assembly Elections 2026
TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ముందంజలో నిలిచి అధికార స్థాపన దిశగా దూసుకుపోతోంది. వెల్లడైన ఫలితాలను బట్టి తమిళనాట విజయ్ గెలుపు దాదాపు ఖాయమైంది. మెజారిటీకి అవసరమైన మరికొన్ని స్థానాల కోసం ఇతర పార్టీల మద్దతు అవసరం కావచ్చు. ఏదేమైనా, విజయ్ సాధించిన ఈ అపూర్వ విజయం దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రకు నాంది పలుకుతోంది. ఆయన గెలుపులో ఎన్నికల హామీలతో పాటు ‘జెన్ జీ’ (Gen Z) తరం అభిమానులు వెన్నెముకగా నిలిచారు.
డిజిటల్ సైన్యం – జెన్ జీ ప్రభావం
విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసినప్పటి నుండి 18-25 ఏళ్ల లోపు యువతే ఆయనకు అతిపెద్ద మద్దతుదారులుగా నిలిచారు. ఈ తరం ఓటర్లకు పాత కాలం నాటి కుల, మత రాజకీయాల కంటే ‘ఐడెంటిటీ’, ‘ట్రెండ్’ ముఖ్యం. దీన్ని గుర్తించిన విజయ్ టీమ్.. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రతి గల్లీలోకి తీసుకెళ్లారు. కేవలం సినిమా క్రేజ్‌తో కాకుండా, ఒక స్పష్టమైన లక్ష్యంతో ఆయన యువతను ఆకర్షించారు. గత కొన్నాళ్లుగా సినిమా ఆడియో లాంచ్‌లు, ఫ్యాన్ మీటింగ్స్‌లో నిరుద్యోగం, అవినీతి, పాలన వంటి అంశాలపై విజయ్ మాట్లాడటం కొత్త ఓటర్లను విపరీతంగా ఆకట్టుకుంది.
సినిమాలకు స్వస్తి – పూర్తిస్థాయి రాజకీయం
ఫిబ్రవరి 2024లో టీవీకేను ప్రారంభించినప్పుడు విజయ్ ఎంతో పట్టుదలగా కనిపించారు. 2026 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, డీఎంకే-ఏఐఏడీఎంకే ద్వంద్వాధికారానికి తామే ప్రత్యామ్నాయమని ప్రకటించారు. ముప్పై ఏళ్ల సినీ కెరీర్‌కు ముగింపు పలకడం ద్వారా, రాజకీయం తనకు ‘సైడ్ బిజినెస్’ కాదనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు.
గత రెండేళ్లుగా తన అభిమాన సంఘాలను అధికారిక పార్టీ కమిటీలుగా మార్చి క్షేత్రస్థాయిలో పట్టు సాధించారు. ఆవేశపూరిత ఉపన్యాసాల కంటే, సమస్యలను వినే నాయకుడిగా ఆయన అనుసరించిన శైలి యువతకు బాగా నచ్చింది. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లడం, విద్యావంతులను పార్టీ వాలంటీర్లుగా మార్చుకోవడం విజయ్‌కు కలిసొచ్చింది. దశాబ్దాలుగా ఏలుతున్న దిగ్గజ పార్టీల పట్ల విసిగిపోయిన ఓటర్లకు ఆయన ఒక సరికొత్త ఆశగా కనిపించారు. దీనికి తోడు మహిళలు, రైతులు, నిరుద్యోగుల కోసం ఇచ్చిన హామీలు గెలుపుకు ప్రధాన కారణమయ్యాయి.
రజనీ, కమల్‌లకు సాధ్యం కానిది..
తమిళనాడులో 1977లో ఎంజీఆర్ సినిమాల నుంచి వచ్చి ప్రభంజనం సృష్టించారు. ఆయన తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ వంటి హేమాహేమీలు రాజకీయాల్లో తమ ముద్ర వేయాలని ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలితం సాధించలేకపోయారు. దీనికి ప్రధాన కారణం కూడా జెన్ జీ తరమే. ప్రస్తుత యువతకు రజనీ, కమల్ల కీర్తి ప్రతిష్టల కంటే ఈ తరం నటుడైన విజయ్ పాపులారిటీతోనే ఎక్కువ అనుబంధం ఉంది. ఈ క్రేజ్ ఆయనను నేరుగా ముఖ్యమంత్రి కుర్చీ వైపు నడిపించింది. పైగా అభిమానులను బలమైన ఓటరు శక్తిగా మార్చుకోవడంలో కమల్, రజనీ ఫెయిల్ అయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జెన్ జీ సత్తా
ఇటీవల అర్జెంటీనా ఎన్నికలు, బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమంలో జెన్ జీ తరం కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళనాడులోనూ అదే పునరావృతమై విజయ్ పార్టీని గెలుపు తీరాలకు చేర్చింది.
