Rapido Rider : ‘మీరు క్యూట్ ఉన్నారు.. మీ వయసెంత’.. ర్యాపిడో డ్రైవర్ మెసేజులు.. మహిళ చేసిన పనికి

Rapido Rider : ర్యాపిడో డ్రైవర్ అనుచిత ప్రవర్తనపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు..

Ghaziabad woman Reveals Rapido drivers inappropriate messages to her company says public apology

Rapido Rider : సొంతంగా డ్రైవింగ్ రాని వారు, బస్సుల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయలేని వారు, త్వరగా గమ్యస్థానాలకు చేరాలనుకునే వారిలో చాలా మంది ర్యాపిడో, ఉబర్ వంటి బైక్, ట్యాక్సీ సేవలను ఆశ్రయిస్తున్నారు. ఈ సర్వీసులు చాలా వరకు క్షేమంగా ఉన్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. రైడ్ పూర్తయిన తర్వాత ఓ ర్యాపిడో డ్రైవర్, ప్రయాణికురాలికి మెసేజ్ చేసి ఇబ్బంది పెట్టాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సదరు ప్రయాణికురాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఆందోళన వ్యక్తం అయ్యింది. దీంతో ర్యాపిడో యాజమాన్యం స్పందించింది.

ఏం జరిగిందంటే..

ఈ సంఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళ ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్లింది. రైడ్ పూర్తయిన తర్వాత ఆమెకు వాట్సాప్‌లో కొత్త నంబర్ నుంచి ‘హాయ్’ అంటూ మెసేజ్ వచ్చింది. ఎవరని ఆ మహిళ ప్రశ్నిస్తే.. “గుర్తు పట్టలేదా.. ఇప్పుడే మిమ్మల్ని డ్రాప్ చేశాను” అని సదరు ర్యాపిడో డ్రైవర్ సమాధానం చెప్పాడు.

దీంతో సదరు మహిళ “ర్యాపిడో డ్రైవరా?” అని మెసేజ్ చేయగా.. అతడు అవునని బదులివ్వడమే కాక.. “మీరు చాలా క్యూట్‌గా ఉన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో మీరు చాలా అందంగా ఉన్నారు. మీ వయసెంత?” అంటూ ఆమెను ఇబ్బందికి గురి చేసే ప్రశ్నలు అడిగాడు. అంతటితో ఆగక ఆమె ఒంటరిగా ఉంటున్నట్లయితే, తర్వాతి రోజు 4 గంటలకు కలవమని కోరాడు.

బాధితురాలి స్పందన

దీంతో సదరు ప్రయాణికురాలు ఆ ర్యాపిడో డ్రైవర్ నంబర్ బ్లాక్ చేసింది. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది. నిమిషాల వ్యవధిలోనే ఇది వైరల్ అవ్వడమే కాక.. ఈ అంశంపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం అయ్యింది.

ర్యాపిడో యాజమాన్యం వివరణ

విషయం సీరియస్ అవ్వడంతో ర్యాపిడో యాజమాన్యం ఈ అంశంపై స్పందించి, బహిరంగ క్షమాపణలు కోరింది. “డ్రైవర్ అనుచిత ప్రవర్తన పట్ల మేం చింతిస్తున్నాం. ఇందుకుగాను మీకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ప్రవర్తనను మేం అంగీకరించం. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రైడ్ ఐడీ వివరాలు ఇస్తే మేం దర్యాప్తు చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటాం. మళ్లీ ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.