Helicopter Badrinath : ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ మిస్సింగ్.. ఆరుగురి కోసం ముమ్మర గాలింపు.. రంగంలోకి మరో 2 చాపర్లు!
Helicopter Badrinath : బద్రీనాథ్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ అదృశ్యమైంది.. ఇందులో ఐదుగురు ప్రయాణికులతో పాటు ఒక పైలట్ ఉన్నారు.. సహాయక బృందాలు హెలికాప్టర్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు..
Helicopter Badrinath
- బద్రీనాథ్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ మిస్సింగ్..
- ప్రతికూల వాతావరణంలో కొనసాగుతున్న గాలింపు
- జోషిమఠ్ సమీపంలో హెలికాప్టర్ ఆచూకీ గల్లంతు..
Helicopter Badrinath : ఉత్తరాఖండ్‌లో తీవ్ర ఆందోళనకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. బద్రీనాథ్ నుంచి ఫాటా వైపు ప్రయాణిస్తున్న ఓ హెలికాప్టర్ అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఇందులో ఐదుగురు ప్రయాణికులతో పాటు ఒక పైలట్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
మొత్తం ఆరుగురు ఆచూకీ తెలియకపోవడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ట్రాన్స్ భారత్ ఏవియేషన్‌కు చెందిన ఈ హెలికాప్టర్ ప్రయాణ మార్గంలోనే అదృశ్యమైనట్లు ప్రాథమిక సమాచారం. చమోలి జిల్లా జోషిమఠ్ పరిసరాల్లోని ఛాయి గ్రామం సమీపంలో హాథీ పహార్ వెనుక ప్రాంతంలో కూలిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు..
అయితే, ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా ధృవీకరించిన ప్రమాద స్థలం గానీ, శకలాలు గానీ గుర్తించలేదు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గల్లంతైన విమానం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది.
ఆచూకీ తెలుసుకునేందుకు మరో 2 హెలికాప్టర్లను కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. కొండ ప్రాంతాల్లో విస్తరించిన అటవీ ప్రాంతాలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు సహాయక చర్యలకు సవాలుగా మారాయి..
ముఖ్యంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, దట్టమైన మేఘాలు, తక్కువ దృశ్యమానత కారణంగా గాలింపు పనులు నెమ్మదిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ అధికారులు హెలికాప్టర్ జాడను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు, విమానంలో ఉన్న ఆరుగురి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదం జరిగిందా? లేక వాతావరణం కారణంగా హెలికాప్టర్ మార్గం తప్పిందా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై ఇంకా క్లారిటీ లేదు..
