Milk Price Hike: పెరిగిన పాల ధరలు.. లీటరుపై రూ. 8 వడ్డింపు.. సర్కార్ కీలక నిర్ణయం
పాల ధరలు(Milk Price Hike) పెంచుతూ సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.
Karnataka Cabinet approves milk price hike of Rs 8 per litre.
Milk Price Hike: కర్ణాటకలో పాల ధరలు మరోసారి భారీగా ఎగబాకాయి. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితుల నేపథ్యంలో దిగాలుపడిన పాడి పరిశ్రమను, రైతులను ఆదుకునే దిశగా సిద్ధరామయ్య ప్రభుత్వం పాల ధరను లీటరుకు రూ. 8 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ పెంపునకు ఆమోదముద్ర వేసినప్పటికీ.. ప్రస్తుతం విధాన పరిషత్తు ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అధికారికంగా వెల్లడించలేదు. ఎన్నికల సంఘం (EC) నుంచి ముందస్తు అనుమతి లభించిన వెంటనే ఈ పెరిగిన నూతన ధరలు రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి.
రూ.10 డిమాండ్ చేస్తే రూ.8కే ఓకే.. నాలుగేళ్లలోనే రెట్టింపు స్థాయి పెంపు:
పశువుల మేత, దాణా, వైద్యం, నిర్వహణ, ప్యాకేజింగ్ ఖర్చులు విపరీతంగా పెరగడంతో లీటరుకు(Milk Price Hike) రూ. 10 పెంచాలని కర్ణాటక పాల మండలి విజ్ఞప్తి చేసింది. అయితే వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సర్కారు రూ. 8 పెంపునకే ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం సగటున రూ. 46గా ఉన్న నీలి రంగు ప్యాకెట్ పాల ధర రూ. 54కు చేరనుంది. గత నాలుగేళ్లలో వరుసగా ధరలు పెరుగుతూ రాగా, ఈసారి ఏకంగా రెట్టింపు స్థాయిలో ధర పెరగడం గమనార్హం. పొరుగు రాష్ట్రాలైన ఏపీ (రూ.41.50), కేరళ (రూ.41.80)తో పోలిస్తే తమ వద్ద ధరలు తక్కువగా ఉన్నాయని కేఎమ్ఎఫ్ తెలిపింది.
జనవరిలో పంచాయతీ ఎన్నికలు.. గ్రేటర్ బెంగళూరుకు ఐదు పోలీస్ కమిషనరేట్లు:
ఇక ఈ కేబినెట్ సమావేశంలో పాల ధరతో పాటు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం జిల్లా, తాలూకా, గ్రామ పంచాయతీ ఎన్నికలను వచ్చే ఏడాది జనవరి తొలివారంలో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీనితో పాటు గ్రేటర్ బెంగళూరు అథారిటీ పరిధిలో ఐదు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు, డేటా సెంటర్ల డిజిటలైజేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ‘యువ ఆపద మిత్ర’ ద్వారా 10,350 మంది స్వచ్ఛంద సేవకులకు శిక్షణ ఇవ్వడానికి, అత్యవసర కిట్ల కొనుగోలుకు రూ. 10.35 కోట్లు కేటాయించారు.
