Mamata Banerjee: బెంగాల్లో రీపోలింగ్ పెట్టాలి.. సీఈసీని అరెస్ట్ చేయాలి.. SIR వివాదంపై మమతా సంచనల కామెంట్స్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, ఈసీ కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డాయని మమతా బెనర్జీ (Mamata Banerjee)తీవ్ర ఆరోపణలు చేశారు.
Mamata Banerjee sensational comments on voter list revision controversy.
Mamata Banerjee: ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాల తీరుపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల నిర్వహణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, ఈసీ కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డాయని మమతా బెనర్జీ(Mamata Banerjee) తీవ్ర ఆరోపణలు చేశారు. పాత ఓటర్ల జాబితా ఆధారంగానే రాష్ట్రంలో వెంటనే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై త్వరలోనే ‘ఇండియా’ కూటమి సమావేశమై తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.
మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్ధవ్ ఠాక్రే.. ఈసీ వైఖరిపై విమర్శలు:
మరోవైపు శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సైతం మహారాష్ట్రలో ప్రజాస్వామ్య బద్ధంగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల తొలగింపు ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ప్రతిపక్షాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన సంస్థల స్వయంప్రతిపత్తి ప్రమాదంలో పడిందని విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టిన భాజపా.. సంబిత్ పాత్ర స్పష్టత:
అయితే ప్రతిపక్షాల ఆరోపణలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల కమిషనర్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం అనేది ఈసీ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తోందనడానికి నిదర్శనమని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు. బెంగాల్లో ఓట్ల తొలగింపు ద్వారా భాజపా లబ్ధి పొందిందనడం వాస్తవం కాదని, అత్యధికంగా ఓట్లు తొలగించిన 20 నియోజకవర్గాల్లో భాజపా కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలిచిందని వివరించారు. ప్రతిపక్షాలు తమ స్వయంకృతాపరాధంతోనే ఇటువంటి విమర్శలు చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
