నిత్యం ఏదోక వివాదాస్పద..సంచలన వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎమ్మెల్యేలు మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు. చికెన్ షాపుల సమీపంలో ఆవుపాలు అమ్మటానికి వీల్లేదు అంటున్నారు మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించటానికే తప్ప మరోటి కాదంటున్నారు కాంగ్రెస్ నేతలు.
అసలు విషయం ఏమిటంటే..మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. గిరిజన మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. చికెన్‌తో పాటు కోడిగుడ్లు, ఆవు పాలు ఒకే దగ్గర ప్రజలు పొందేందుకు వీలుగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. ఈ క్రమంలో పైలట్ ప్రాజెక్టుగా భోపాల్‌లోని వైశాలినగర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనిపై ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మండిపడుతోంది. దీంతో చికెన్ దుకాణాల వద్ద పాల షాపులను ఏర్పాటు చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చికెన్ మాంసం, కోడిగుడ్లు అమ్మే దుకాణాల సమీపంలో ఆవు పాలను అమ్మడమేంటి? ఇది అపచారం అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విమర్శిస్తున్నారు.
చికెన్, పాలను వేర్వేరు వ్యాపారస్తులకు అప్పగించాలని..ఈ రెండు దుకాణాలు పక్క పక్కన ఉండకూదనీ.. ఆ షాపుల మధ్య కూడా దూరం పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని బీజేపీ ఎమ్మెల్యేలు అంటున్నారు.ఇటువంటి చర్యలతో ప్రజల మత విశ్వాసాలకు భంగం కలుగుతుందంటున్నారు.
బీజేపీ ఎమ్మెల్యేలు విన్నతిపై పశు సంవర్ధక శాఖ మంత్రి లఖాన్ సింగ్ మాట్లాడుతూ..ప్రజలకు ఒకేచోట చికెన్, కోడిగుడ్లు, పాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామనీ..ఈ పథకంతో గిరిజనులకు ఉపాధి దొరుకుతుందన్నారు. కడక్‌నాథ్ చికెన్‌ను కూడా ఈ చికెన్ షాపుల్లో విక్రయించేలా చేస్తున్నామని మంత్రి తెలిపారు. గిరిజనులకు ఉపాధి లభిస్తున్న ఈ పథకంపై అనవసరంగా బీజేపీ నేతలు రాద్ధాం చేయటం తగదని సూచించారు.