My dream is to cover distance between Delhi & Mumbai's Nariman Point in 12 hrs Gadkari
Delhi-Mumbai Express Highway: దేశంలో రెండు ప్రధానమైన నగరాలు, రద్దీగా ఉండే నగరాలు ముంబై, ఢిల్లీ. ఒకటి దేశానికి ఆర్థిక రాజధాని కాగా, మరొకటి దేశానికి రాజకీయ రాజధాని. అత్యధిక జనాభా, అనేక కార్యక్రమాలు, అనేక కార్యకలాపాలతో ఈ రెండు నగరాలు నిద్రనే మర్చిపోయాయి. ఇక ఈ రెండు నగరాల్లో ఉండే రద్దీ.. రెండు నగరాల మధ్య కూడా ఉంటుంది. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, విమానాలు ఇలా ఎన్ని ఉన్నప్పటికీ.. ఈ రెండు నగరాల మధ్య రద్దీని తగ్గించడం సాధ్యం కావడం లేదు. రద్దీ తగ్గించడం కాదు కానీ, ప్రయాణాన్ని మరింత కాస్త సులభతరం చేసేలా ఇరు నగరాల మధ్య ఎక్స్‌ప్రెస్‌వేను రూపొందించి నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర రవాణాశాఖ మంత్రి ప్రత్యేక శ్రద్ధతో రహదారి డిజైన్ నుంచి నిర్మాణ పనులను దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేగా గుర్తింపు పొందిన ఈ రోడ్డు.. మొదటి విడత పనులు ఈ యేడాదిలోనే పూర్తవుతాయని కేంద్ర మంత్రి గడ్కరీ మంగళవారం వెల్లడించారు. వాస్తవానికి ఢిల్లీ-ముంబై మధ్య ఉండే దూరాన్ని 12 గంటలకు తగ్గించడం తన కల అని.. ఆ పనులు తొందరలోనే పూర్తవుతాయని ఆయన అన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే పనులను ఆయన హెలికాఫ్టర్ ద్వారా మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన స్పందిస్తూ ‘‘నారిమన్ పాయింట్ (ముంబై) నుంచి ఢిల్లీ వరకు ఉన్న దూరాన్ని 12 గంటలకు తగ్గించడం నా కల’’ అని అన్నారు.