Prakash Shah Was Once Mukesh Ambanis Vice President Of Reliance Now Become Sanyasi
Prakash Shah కోట్లలో జీతం..రోజంతా బిజీబిజీ..కోట్లలో జీతం క్షణం తీరికలేకుండా మీటింగ్ లు,టార్గెట్లు…ప్రత్యర్థి వ్యాపారాలను అధిగమించేదెలా అని ఎత్తులు,పైఎత్తులు.. వ్యాపారాభివృద్ధి గురించి కిందిస్థాయి ఉద్యోగులకు క్లాస్ లు.. ఇలా రోజు గడిచిపోయేదాయనికి. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే వాటన్నింటినీ వదిలిపెట్టి.. ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు. కోట్ల ఆదాయం వదులుకుని సుఖదు:ఖాలకు అతీతంగా జీవిస్తున్నారు. ఆయనే రిలయన్స్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన ప్రకాష్ షా.
40ఏళ్ల క్రితం ఐఐటీ-బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ లో బీటెక్,ఎంటెక్ పూర్తి చేసిన ప్రకాష్ షా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో వివిధ కీలక హోదాల్లో పనిచేశారు. గతేడాది వైస్ ప్రెసిడెంట్(ప్రాజెక్ట్స్)హోదాలో రిటైర్డ్ అయిన ప్రకాష్ షా ఇప్పుడు తన మిగిలిన జీవితాన్ని మరొకలా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్-25,2021న మహవీర్ జయంతి సందర్భంగా ప్రకాష్ షా, ఆయన భార్య నైనా షా కూడా సన్యాసం స్వీకరించారు. జైన మత సంప్రదాయం ప్రకారం గచ్చిధిపతి పండిత్ మహారాజ్ సమక్షంలో జైన తీర్థంకురులలో ఒకరైన మహావీరుడి జన్మ కల్యాణ దినాన సన్యాస దీక్ష తీసుకున్నారు. దీక్ష తర్వాత వారి పేర్లు మారాయి. ప్రకాష్ షా దంపతుల కొత్త పేరు..ప్రశాంత్ భూషణ్ విజయజీ మహరాజ్ సాహెబ్,భవ్యనిధి సాధ్విజీ మహరాజ్ సాహెబ్.
వాస్తవంగా జైన మతంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు సన్యాసం స్వీకరించడం సహజమే. జైన మతం ప్రకారం సన్యాసం స్వీకరిస్తే..సుఖాలను,హోదాలను విడిచిపెట్టాలి. సంపాదన కాంక్ష ఉండకూడదు. శాఖాహారం,ఉపవాస దీక్షలు తప్పనిసరి. అలా దేహాన్ని క్రమక్రమంగా మహానిర్వాణం వైపు తీసుకెళ్తారు. చివరకు ఆ దీక్ష నుంచి మహాప్రస్థానానికి చేరతారు.
అయితే,ప్రకాష్ షా,ఆయన భార్య ఈ సన్యాస దీక్ష గతేడాదే స్వీకరించాల్సి ఉండగా కరోనా వలన ఆలస్యమైనట్లు సమాచారం. ఆయన భార్య నయన్ కామర్స్‌లో పట్టభద్రురాలు. వీరికి ఇద్దరు కుమారులు. వీరిలో ఒక కుమారుడు ఏడేళ్ల కిందటే సన్యాసం స్వీకరించగా మరో కుమారుడు వివాహం చేసుకున్నాడు.