Droupadi Murmu: అమవీరుడి తల్లి ఆవేదన.. గుండెలకు హత్తుకున్న రాష్ట్రపతి.. రాష్ట్రపతి భవన్లో కన్నీళ్లు పెట్టించిన దృశ్యం
రాష్ట్రపతి భవన్(Droupadi Murmu)లో సోమవారం జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమనీ-2026లో అత్యంత కదిలించే దృశ్యం ఆవిష్కృతమైంది.
President droupadi murmu consoles mother of martyr praveen prabhakar
- కీర్తి చక్ర అందుకుంటూ కన్నతల్లి రోదన
- ప్రోటోకాల్ పక్కనబెట్టి ఓదార్చిన రాష్ట్రపతి ముర్ము
- ఉగ్రవాదులను మట్టుబెట్టి సైనికుడి వీరమరణం
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమనీ-2026లో అత్యంత కదిలించే దృశ్యం ఆవిష్కృతమైంది. దేశం కోసం ప్రాణాలర్పించిన సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు మరణానంతరం ప్రకటించిన ‘కీర్తి చక్ర’ పురస్కారాన్ని అందుకోవడానికి ఆయన తల్లి వేదికపైకి వచ్చారు. మైకులో తన కుమారుడి పేరు వినగానే ఆమె గుండె కోత కన్నీరుగా మారి ఉప్పొంగింది. కన్నబిడ్డ జ్ఞాపకాలతో ఆమె వేదికపైనే కన్నీరుమున్నీరు కావడం అక్కడ ఉన్న వారందరినీ తీవ్రంగా చలింపజేసింది.
ప్రోటోకాల్ పక్కనబెట్టిన రాష్ట్రపతి:
ఆ తల్లి ఆవేదనను గమనించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) మానవీయతతో స్పందించారు. అధికారిక నిబంధనలు, ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి ఆమె స్వయంగా ముందుకు వచ్చి ఆ వీరమాత చేతులను పట్టుకుని ఓదార్చారు. కుమారుడిని కోల్పోయిన తల్లి బాధను, తన స్వంత పిల్లలను కోల్పోయిన అనుభవం ఉన్న ఒక తల్లిగా అర్థం చేసుకుంటూ ఆమెను హత్తుకుని ధైర్యం చెప్పారు. ఈ అపూర్వ ఘట్టం సభలోని సైనికాధికారులు, కేంద్ర మంత్రులను సైతం భావోద్వేగానికి గురిచేసి, కళ్లు చెమర్చేలా చేసింది.
చివరి శ్వాస వరకు వీరపోరాటం:
మహార్ రెజిమెంట్‌కు చెందిన ప్రవీణ్ ప్రభాకర్, 2024 జూలై 6న జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో వీరమరణం పొందారు. ప్రాణాలకు తెగించి ఇద్దరు కరుడుగట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టడమే కాకుండా, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ తన శరీరంతో అడ్డుగా నిలిచి ఓ పౌరుడి ప్రాణాన్ని కాపాడారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన ఈ యువ సైనికుడి వీరత్వానికి లభించిన ఈ పురస్కార వేడుక, దేశభక్తితో పాటు కన్నతల్లి ప్రేమకు ప్రతీకగా నిలిచిపోయింది.
