PSLV-C49/EOS-01 – ISRO : ఇస్రో మరో ఘనత సాధించింది. ఒకేసారి పది ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం శ్రీహరికోట నుంచి PSLV-C-49 రాకెట్ ను ప్రయోగించారు. తొలి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. 290 టన్నుల బరువున్న ఈ రాకెట్ ద్వారా..ఒక స్వదేశీ, 9 విదేశీ ఉప గ్రహాలను రోదసీలోకి పంపింది ఇస్రో.
కౌంట్‌డౌన్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటా రెండు నిమిషాలకు ప్రారంభమైంది. పీఎస్‌ఎల్‌వీ ఇండియాకు చెందిన ఈవోఎస్-1తోపాటు, విదేశాలకు చెందిన 9 శాటిలైట్లను నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్లింది. దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ద్వారా వాతావరణ, వ్యవసాయ, అటవీ సంబంధ సమాచారం తెలుసుకోవచ్చు. వాహకనౌకకు రూ.175 కోట్లు, ఉపగ్రహానికి రూ. 125 కోట్ల వరకు వ్యయం చేశారు.
కరోనాతో కొన్నాళ్లుగా ప్రయోగాలకు దూరంగా ఉన్న ఇస్రో.. పీఎస్‌ఎల్‌వీ సీ-49 ప్రయోగించింది. ఒక స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపింది. కేవలం 13.55 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తయ్యింది. ప్రయోగం సక్సెస్ అవడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రయోగానికి కంటే ముందు..అన్ని ఇనిషియల్ టెస్ట్‌లు పూర్తి చేశారు సైంటిస్టులు. శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. పీఎస్ఎల్వీ సీ-49 బరువు 290 టన్నులు. ఈ ప్రయోగంతో మన దేశానికి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-01ను అంతరిక్షంలోకి చేర్చనుంది PSLV -C49. భూ పరిశీలన, వాతావరణ విపత్తులను ముందుగానే అంచనా వేయడం, అటవీ ప్రాంతాలపై పరిశోధనలకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది.
లుతివేనియాకు చెందిన R2 ఉపగ్రహం, లక్సెంబర్గ్‌కు చెందిన నాలుగు ఉపగ్రహాలు, అమెరికాకు చెందిన 4 ఉపగ్రహాలను కూడా నింగిలోకి తీసుకుపోయింది PSLV రాకెట్. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో రెండోసారి ప్రయోగిస్తున్న సరికొత్త రాకెట్ ఇది. రెండే రెండు స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో చేస్తున్న ప్రయోగం కావడంతో దీనికి పీఎస్‌ఎల్‌వీ-డీఎల్ అని పేరు పెట్టారు. ఈ తరహా రాకెట్‌ను తొలిసారిగా గత ఏడాది జనవరి 24న ప్రయోగించి విజయం సాధించారు.
ఉపగ్రహాల బరువు చాలా తక్కువ కావడంతో ఖర్చు తగ్గించుకోవడానికి రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో ప్రయోగం చేస్తున్నారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈఓఎస్-01గా పిలిచే స్వదేశీ ఉపగ్రహంతో పాటు మరో 9దేశాలకు చెందిన తేలికపాటి ఉపగ్రహాలను భూమికి అత్యంత చేరువలోని సూర్యానువర్తన కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ప్రయోగాన్ని అత్యంత తక్కువ సమయంలోనే అంటే 13.55 నిమిషాల్లో పూర్తి చేశారు.
చంద్రయాన్- 2లో భాగంగా గతేడాది జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో.. 2020లో 15 ప్రయోగాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కరోనా కారణంగా ఇవి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం మరో రెండు రాకెట్ ప్రయోగాలకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో ప్రకటించింది.. శ్రీహరి కోట నుంచి ఇప్పటి వరకు మొత్తం 76 ప్రయోగాలు చేయగా.. PSLV సిరీస్‌లో ఇది 51వ ప్రయోగం. కోవిడ్ కారణంగా సందర్శకులకు అనుమతిని నిరాకరించింది ఇస్రో.
మరోవైపు.. తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు.. PSLV-C49 ప్రయోగం నిర్వహించనున్న నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో రాకెట్ నమూనాకు పూజలు నిర్వహించారు.. రాకెట్ ప్రయోగానికి ముందు శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది.