Rahul Gandhi : రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదు.. మోదీ, అదానీపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi : హైదరాబాద్ భారత్ సమిట్-2026లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాసిస్టు రాజకీయాలు, 2014-2024 ఎన్నికలు, మోదీ-అదానీ సంబంధాలపై చేసిన విమర్శలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి..
Rahul Gandhi
- 2014 నుంచి ప్రజాస్వామ్యానికి గండం
- వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తున్నారు..
- భారత్ సమిట్లో రాహుల్ గాంధీ ఫైర్
Rahul Gandhi : హైదరాబాద్ వేదికగా రాజకీయ వేడి మరోసారి రాజుకుంది.. భారత్ సమిట్-2026లో పాల్గొన్న లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లలో దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యం పేరుతో గొప్పలు చెప్పుకోవడం కాదు.. దాన్ని కాపాడుకోవడానికి పోరాడాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
2014, 2024 ఎన్నికలపై రాహుల్ ఆరోపణలు :
2014 ఎన్నికల సమయంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఆ ఎన్నికలతోనే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం మొదలైందని రాహుల్ విమర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ పలు సందేహాలు వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో గెలిచిన కూటమి, 3 నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం వెనుక కారణాలేంటని ప్రశ్నించారు. ఆ సమయంలో 70 లక్షలకు పైగా ఓట్లు అదనంగా నమోదయ్యాయని ఆరోపించారు..
మోదీ, అదానీ బంధంపై విమర్శలు :
ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక అదానీ వ్యాపార సామ్రాజ్యం భారీగా విస్తరించిందని రాహుల్ అన్నారు. ఒకప్పుడు సంపన్నుల జాబితాలో 600వ స్థానంలో ఉన్న వ్యక్తి రెండో స్థానానికి ఎలా చేరుకున్నారని ప్రశ్నించారు. పోర్టులు, విమానాశ్రయాలు, మౌలిక వసతులు వంటి కీలక రంగాల్లో అదానీ పెట్టుబడులు పెరగడాన్ని ప్రస్తావించారు. లబ్ధి పొందుతున్న వ్యాపారవేత్తలే వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు..
సత్యం, అహింసతోనే పోరాటం :
రాజకీయాలంటే గట్టిగా మాట్లాడటం, విమర్శలు చేయడం మాత్రమే కాదని రాహుల్ అన్నారు. ప్రజల సమస్యలు వినడం, రాజ్యాంగం, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే అసలైన బాధ్యతని పేర్కొన్నారు.
సత్యం, అహింస బలమైన ఆయుధాలన్నారు. విద్వేషం, హింసతో సమాజం అభివృద్ధి చెందలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.
