తమ కుటుంబసభ్యులకే భారతరత్న రావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది

భారతరత్నలన్నీ తమ కుటుంబ సభ్యులకే రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ…భారతరత్నకు వీరసావర్కర్‌ పేరును ప్రతిపాదించడంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌‌కు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. 
 
బుధవారం(అక్టోబర్-16,2019)మహారాష్ట్రలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ…వీరసావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలని బీజేపీ మేనిఫెస్టోలో తెలపడంపై కాంగ్రెస్‌ ఎందుకు కలత చెందుతోంది. సావర్కర్ దేశభక్తుడు కాదా? నేను నాలుగైదు సార్లు అండమాన్ నికోబార్‌కు వెళ్లాను. వెళ్లిన ప్రతిసారి 11 ఏళ్లు ఆయన జైలుజీవితం గడిపిన సెల్‌ లో తప్పనిసరిగా కూర్చుంటానని ఆయన అన్నారు. 11 ఏళ్ల పాటు జైలుజీవితం గడిపి, దేశం నుంచి ఏరోజూ ఏదీ కోరని వ్యక్తికి, సమాజ సంక్షేమానికి పాటుపడిన జ్యోతిరావు పూలే, సావిత్రి పూలే వంటి దేశభక్తులకు నిశ్చయంగా భారతరత్న ఇచ్చితీరాలన్నారు.
 
గాంధీ హత్య కేసులో సావర్కర్ నిందితుడనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని, సాక్ష్యాలు లేకనే ఆయనను విడిచిపెట్టారని కాంగ్రెస్ నేత రషీద్ అల్వి అన్నారు. ఇవాళ సావర్కర్‌కు భారతరత్న ఇస్తామంటున్న వారు రేపు గాడ్సే పేరు కూడా ప్రతిపాదిస్తారనే భయం కలుగుతోందని ఆయన అన్నారు.