Fenugreek Rs 50 Fine : మెంతికూర తీసుకొచ్చాడని విద్యార్థికి రూ.50 జరిమానా.. స్కూల్ యాజమాన్యంకు బిగ్ షాకిచ్చిన విద్యాశాఖ
Fenugreek Rs 50 Fine : మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. మెంతి కూర లంచ్ బాక్సులో తెచ్చినందుకు విద్యార్థికి రూ.50ఫైన్ విధించడం వివాదాస్పదంగా మారింది.
Fenugreek Rs 50 Fine
Fenugreek Rs 50 Fine : మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం.. విద్యార్థులు మెంతికూరను టిఫిన్ బాక్సులో తెచ్చినందుకు ఫైన్ విధించింది. ఒక్కో విద్యార్థికి రూ.50ఫైన్ విధించడంతోపాటు.. విద్యార్థుల తల్లిదండ్రులకు పంపించిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదాస్పదంగా మారింది.
థాణె జిల్లాలోని భాయందర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల జైనుల పవిత్ర పండుగ ‘పర్యుషన్’ రోజున పాఠశాలకు ఇంటి నుంచి మెంతికూర వంటకం తీసుకొచ్చినందుకు ఫైన్ విధించింది. పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు జైన్ కమ్యూనిటీకి చెందినవారన్న కారణంతో అడ్మిషన్ సమయంలోనే పిల్లల టిఫిన్‌లో నాన్‌వెజ్‌తో పాటు కొన్ని కూరగాయలు తీసుకురావద్దని తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం సూచించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ విద్యార్థి టిఫిన్‌లో మెంతికూర వంటకం తీసుకురావడంతో పాఠశాల యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు.. మెంతికూరను పాఠశాలలో నిషేధించిన ఆహారంగా పేర్కొంటూ విద్యార్థి డైరీలో రిమార్క్ రాసినట్లు కూడా సమాచారం.
మెంతికూర తినకూడదని చెప్పడంతో విద్యార్థికి ప్రత్యామ్నాయంగా క్యాంటీన్ నుంచి ఆహారం అందించేందుకు రూ.50 వసూలు చేసినట్లు పాఠశాల తల్లిదండ్రులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో ఎంబీఎంసీ విద్యాశాఖ స్పందించింది. విద్యార్థుల ఆహారంపై ఇటువంటి ఆంక్షలు విధించడం, ఆహారం తీసుకొచ్చినందుకు జరిమానా వసూలు చేయడంపై వివరణ ఇవ్వాలని పాఠశాల యాజమాన్యంకు షోకాజు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. పాఠశాల నుంచి వచ్చే సమాధానాన్ని పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం.
జైన్ సంప్రదాయం ప్రకారం.. ‘పర్యూషన్’ సమయంలో కొందరు జైన్ భక్తులు ఆకుకూరలు, వేరు కూరగాయలను ఆహారంగా తీసుకోకుండా ఉంటారు. అయితే, పాఠశాల విద్యార్థులపై ఈ నిబంధనలను ఎలా అమలు చేసింది, జరిమానా విధించడానికి ఏ నిబంధన ఆధారంగా తీసుకున్నది అనే అంశాలపై ప్రస్తుతం అధికారుల విచారణ కొనసాగుతోంది.
