ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ పైనా పడింది. షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం(మార్చి 17,2020)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ పైనా పడింది. షిర్డీ సాయి ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం(మార్చి 17,2020) మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది. దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు భక్తుల కోసం ప్రకటన చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆలయం మూసి వేసి ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాలు సిద్ధి వినాయక, ముంబా దేవి టెంపుల్స్ ను మూసివేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో షిర్డీకి రావొద్దని భక్తులను ఇదివరకే కోరారు. షిర్డీ టూర్ ని కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు.
ముంబై సిద్ధి వినాయక ట్రస్ట్ సైతం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఆలయాన్ని మూసివేస్తున్నట్టు సోమవారం(మార్చి 16,2020) ప్రకటించింది. పుణెలోని శ్రీమంత్ గణపతి మందిర్, ముంబైలోని ముంబాదేవి ఆలయాలను కూడా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ దేవాలయాలు మూసివేసి ఉంటాయి.
మహారాష్ట్రలో కొలువుదీరిన షిర్డీ సాయి ఆలయానికి దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. సాయిని దర్శించుకుని తరిస్తారు. కొందరు మొక్కులు చెల్లించుకుంటారు. చాలామంది ముందుగానే షిర్టీ టూర్ ప్లాన్ చేసుకుంటారు. భక్తులతో షిర్డీ నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. జన సమూహం ఎక్కువగా ఉంటుంది. ఓవైపు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. జన సమూహాలపై ఆంక్షలు పెట్టింది. జనాలు ఎక్కువగా ఉన్న చోట కరోనా వేగంగా వ్యాప్తించే అవకాశం ఉండటంతో ఈ చర్యలు తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగానే షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించింది.
మన దేశంలోనూ చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటివరకు మన దేశంలో 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడ్డవారిలో ముగ్గురు చనిపోయారు. భారత్ లో మూడో మరణం మహారాష్ట్రంలోనే చోటు చేసుకుంది. మంగళవారం(మార్చి 17,2020) ముంబైలోని కస్తూర్భా హాస్పిటల్ లో కరోనా ట్రీట్మెంట్ పొందుతున్న 64ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భారత్‌లో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య మూడుకి చేరింది. గతవారంలో కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఓ వృద్ధుడు, ఢిల్లీకి చెందిన మరో వృద్ధుడు కరోనాతో మరణించిన విషయం తెలిసిందే.
Also Read | దిశ తరహా ఘటన…మహిళపై అత్యాచారం చేసి హత్య