రాహుల్ మాట్లాడుతుండగా మైక్ కట్.. లోక్‌సభలో గందరగోళం.. ఏమైందంటే?
చైనా సైన్యం సరిహద్దుల్లోకి చొరబడుతోందని మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకంలో రాసిన అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు.
Rajnath Singh, Rahul Gandhi (Image Credit To Original Source)
- చైనా చొరబాట్ల అంశాన్ని ప్రస్తావించిన రాహుల్
- ఆర్మీ మాజీ చీఫ్ ఓ పుస్తకంలో రాశారని కామెంట్
- ఆ పుస్తకం పబ్లిష్ కాలేదన్న బీజేపీ సభ్యులు
Rahul Gandhi: లోక్‌సభలో గందరగోళం నెలకొంది. పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కింద చర్చ జరుగుతున్న సమయంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ చైనా చొరబాట్ల అంశాన్ని ప్రస్తావించారు.
చైనా సైన్యం సరిహద్దుల్లోకి చొరబడుతోందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఓ పుస్తకంలో రాశారంటూ ఓ మ్యాగజైన్లో ఆర్టికల్ వచ్చింది. ఆ అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. రాహుల్ మాట్లాడుతుండగా స్పీకర్ ఓం బిర్లా మైక్ కట్ చేయడంలో విపక్ష నేతలు అభ్యంతరాలు తెలిపారు.
Also Read: మమ్మల్ని తట్టి లేపిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు.. ఇక చూస్కో.. సజ్జనార్ జడ్జి కాదు: కేటీఆర్
రాహుల్ చెప్పిన పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని బీజేపీ సభ్యులు అన్నారు. ప్రచురితంకాని పుస్తకంలోని అంశాల గురించి రాహుల్ ఎలా మాట్లాడతారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు.
ఇది సభా నిబంధనలకు విరుద్ధమని అన్నారు. రాహుల్ గాంధీ ఏ పుస్తకంలోని అంశాలు చెబుతున్నారో, ఆ పుస్తకాన్ని సభలో చూపాలని అన్నారు. సభను అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని మాట్లాడనివ్వాలని అన్నారు. చైనాకు సంబంధించిన ఆ అంశం చాలా సున్నితమైనదని చెప్పారు. చివరకు లోక్‌సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
