Tamil Nadu CM Vijay : తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం.. నిరుద్యోగులకు శుభవార్త..
Tamil Nadu : నిరుద్యోగులకు ఊరట కలిగించేలా తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Tamil Nadu CM Vijay
Tamil Nadu CM Vijay : తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా గవర్నమెంట్ జాబ్స్ కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఊరటనిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నేరుగా నియామకాలకు సంబంధించిన గరిష్ఠ వయోపరిమితిని మరో ఐదేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Also Read : YS Sharmila : యలహంక ప్యాలెస్ వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్..
ఇప్పటికే వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాలకు ఉన్న వయోసడలింపులకు అదనంగా ఈ ఐదేళ్ల వెసులుబాటు కల్పించారు. ఈ నిర్ణయం ఐదేళ్ల పాటు అమల్లో ఉండనుంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
తాజా నిర్ణయం ప్రకారం.. గ్రూప్-1 ఉద్యోగాలకు జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 32ఏళ్ల నుంచి 37 ఏళ్లకు పెరగనుంది. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు 37 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచారు. దివ్యాంగ అభ్యర్థుల్లో జనరల్ కేటగిరీ వారికి 42 నుంచి 47 ఏళ్లకు, రిజర్వేషన్ కేటగిరీ వారికి 47 నుంచి 52 ఏళ్లకు వయోపరిమితిని పెంచారు.
అలాగే.. గ్రూప్-2 ఉద్యోగాలకు జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయోపరిమితిని 30 నుంచి 35 ఏళ్లకు పెంచారు. జనరల్ కేటగిరీకి చెందిన దివ్యాంగ అభ్యర్థులకు 40 నుంచి 45 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉద్యోగాలకు రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ఇప్పటికే గరిష్ఠ వయోపరిమితి లేదు.
గ్రూప్-4 ఉద్యోగాలకు కూడా కొత్త వయోపరిమితులు వర్తించనున్నాయి. జనరల్ కేటగిరికీ 30 నుంచి 35 ఏళ్లకు పెంచగా.. బీసీ, మైనార్టీ, అత్యంత వెనుకబడిన తరగతుల వర్గాల అభ్యర్థులకు 32 నుంచి 37 ఏళ్లకు పెంపు చేశారు. ఎస్సీ, ఎస్టీ, నిరాశ్రయ వితంతువులకు 35 నుంచి 40 ఏళ్లకు పెంపు చేయగా.. దివ్యాంగ జనరల్ కేటగిరి అభ్యర్థులకు 40 నుంచి 45 ఏళ్లకు పెంపు చేశారు. దివ్యాంగ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వర్తించే పాత పరిమితిని బట్టి ఐదేళ్ల పెంపు ఉంటుంది.
కాగా, ఈ కొత్త నిబంధనలు ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయి. దీంతో తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు మరింత సమయం, అవకాశాలు లభించనున్నాయి.
