TVK Vijay: తమిళనాడులో కింగ్ మేకర్‌గా విజయ్..? టీవీకే పార్టీ కీలక సమావేశం.. 17-సి ఫారాలు ఎందుకు?
TVK Vijay: చెన్నైలో టీవీకే పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. పార్టీకి చెందిన 234 మంది అభ్యర్థులతో పార్టీ అధినేత విజయ్ భేటీ అయ్యారు. ఫలితాల తర్వాత ఎలా వ్యవహరించాలి అనేది అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు విజయ్. అభ్యర్థులంతా 17సి ఫారాలతో మీటింగ్ కు హాజరయ్యారు. టీవీకే పార్టీకి ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉండటంతో విజయ్ పార్టీ ఆఫీస్ లో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. కొన్ని సర్వే సంస్థలు విజయ్ కింగ్ మేకర్ అవుతారంటూ అంచనా వేశాయి.
టీవీకేకి 95 నుంచి 110 స్థానాలు..!
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన తర్వాత తమిళ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. కొన్ని సర్వే సంస్థలు అనూహ్యమైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చాయి. టీవీకే పార్టీకి అధికారం దక్కబోతోందని కీలక సర్వే సంస్థలు అంచనా వేశాయి. విజయ్ కింగ్ మేకర్ అవ్వబోతున్నారని, ఏకంగా 95 నుంచి 110 దాకా సీట్లు విజయ్ పార్టీకి రాబోతున్నట్లుగా ఒకటి రెండు కీలకమైన సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ అంచనా విడుదల చేశాయి. దాంతో ఒక్కసారిగా ఆ పార్టీ వ్యవహారం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి కొన్ని కీలక సర్వే సంస్థలు మాత్రం టీవీకే పార్టీకి 20 స్థానాల లోపే వస్తాయని అంచనా కట్టాయి. ఎన్డీటీవీ, యాక్సిస్ మై ఇండియా వంటి కీలకమైన సంస్థలు మాత్రం దాదాపు 100 సీట్లు తగ్గకుండా విజయ్ కు రాబోతున్నాయని అంచనా కట్టాయి. దీంతో ఒక్కసారిగా తమిళ రాజకీయాలు మారిపోయాయి. ఒక్కసారిగా విజయ్ అలర్ట్ అయిపోయారు. అనూహ్యంగా చెన్నై నగరంలో తన పార్టీ ప్రధాన కార్యాలయంలో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. టీవీకే తరపున ఎన్నికల్లో పోటీచేసిన మొత్తం 234 మంది అభ్యర్థులతో విజయ్ భేటీ అయ్యారు.
అలాగే అభ్యర్థులు తమతో పాటు 17సి ఫారం కూడా తీసుకొచ్చారు. సాధారణంగా 17సి అనేది పోలింగ్ అంతా ముగిశాక పోలింగ్ అధికారి ఆయా అభ్యర్థుల ఏజెంట్లకు అందిస్తారు. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు పోలయ్యాయి.. ఇలాంటి అంశాలతో కూడిన పూర్తి వివరాలు ఈ 17సి ఫారమ్ లో ఉంటాయి. ప్రతి అభ్యర్థి కూడా వారి ఏజెంట్లకు ఇచ్చిన 17సి ఫారం తీసుకుని మీటింగ్ కు రావాలని విజయ్ చెప్పడంతో మొత్తం అభ్యర్థులంతా 17సి ఫారం తీసుకుని వచ్చారు.
ప్రధానంగా ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్ బూత్ లో ఎంత ఓటింగ్ శాతం నమోదైంది, గరిష్టంగా ఎక్కడైంది, తక్కువ ఓటింగ్ ఎక్కడైంది లాంటి అనేక అంశాల మీద చర్చించడం కోసం విజయ్ ఆ ఫారమ్ తీసుకోవడం జరిగింది. అలాగే ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మే 4వ తేదీన అభ్యర్థులు ఏ విధంగా వ్యవహరించాలి, ఎక్కడెక్కడ అందుబాటులో ఉండాలి అనే అంశంపై డిస్కస్ చేశారు విజయ్. అలాగే అనుక్షణం తనకు టచ్ లో ఉండాలని తన పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు విజయ్.
