Venezuela Earthquake: వెనెజువెలాను వణికించిన రెండు భారీ భూకంపాలు.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.5గా నమోదు
దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలా(Venezuela Earthquake)ను నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్రంగా వణికించాయి.
Two massive earthquakes shook Venezuela.
-
వెనెజువెలాలో భారీ జంట భూకంపాలు.
-
రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రత.
-
భయాందోళనతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు.
Venezuela Earthquake: దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాను నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్రంగా వణికించాయి. ఈ భూ ప్రకంపనల ధాటికి దేశ రాజధాని కారకాస్‌తో పాటు పలు నగరాల్లోని ఎత్తైన భవనాలు, నివాస సముదాయాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు. భద్రతా కారణాల దృష్ట్యా అనేకమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
యూఎస్ జియోలజికల్ సర్వే (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ రెండు భూకంపాలు అత్యంత శక్తివంతమైనవిగా నమోదయ్యాయి. మొదటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదు కాగా, కొన్ని నిమిషాల వ్యవధిలోనే వచ్చిన రెండో భూకంపం మరింత తీవ్రతతో 7.5గా నమోదైంది. దేశ కరేబియన్ తీరంలోని మోరోన్ ప్రాంతానికి పశ్చిమాన సుమారు 28 కిలోమీటర్ల దూరంలో, భూగర్భంలో 13 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ భారీ విపత్తుకు సంబంధించిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే, భూకంపం సంభవించిన సమయంలో భవనాలు, కార్యాలయాలు భీతిగొలిపేలా ఊగిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు ప్రకంపనల(Venezuela Earthquake) తీవ్రతను కళ్లకు కడుతుండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.
