Pralhad Joshi: రాహుల్ గాంధీ అహంకారం వల్లే.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి(Pralhad Joshi) విపక్షాల తీరుపై, ప్రత్యేకించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Union Minister Pralhad Joshi sensational comments on Rahul Gandhi
- పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా
- స్పీకర్ విందుకు విపక్షాల హ్యాండ్
- రాహుల్ గాంధీపై జోషి ఆగ్రహం
Pralhad Joshi: తీవ్ర హంగామా, విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. వర్షాకాల సమావేశాల చివరి రోజున లోక్సభ కేవలం వందేమాతర గీతాలాపనకు మాత్రమే పరిమితమైంది. అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్యసభలోనూ కొంతసేపు చర్చ అనంతరం నిరవధిక వాయిదా పడింది. మొత్తం 19 రోజుల పాటు సాగిన ఈ సమావేశాల ముగింపు సందర్భంగా స్పీకర్ ఏర్పాటు చేసిన సంప్రదాయ తేనీటి విందుకు డీఎంకే ఎంపీ కనిమొళి మినహా మిగతా విపక్ష నేతలందరూ గైర్హాజరై తమ నిరసనను వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ అహంకారంతోనే సమావేశాలు దెబ్బతిన్నాయి:
సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi)విపక్షాల తీరుపై, ప్రత్యేకించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వర్షాకాల సమావేశాల సమయంలో రాహుల్ గాంధీ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. కేవలం ఒక వ్యక్తి అహంకారం వల్లే మొత్తం సమావేశాలు దెబ్బతిన్నాయని, ఆమోదించబడిన బిల్లులు మినహా జరగాల్సిన ఇతర ముఖ్యమైన చర్చలు, నిర్మాణాత్మక పనులేవీ జరగకుండా పోయాయని ఆయన ఆరోపించారు.
డిమాండ్లు మార్చుతూ పారిపోతున్నారు:
విపక్షాల వైఖరిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రతిపక్షాలు ప్రతి విషయంలో డిమాండ్లు చేయడం, వాటిని ప్రభుత్వం అంగీకరించినప్పుడు అక్కడి నుంచి పారిపోవడం అలవాటుగా మార్చుకున్నాయని విమర్శించారు. హోం మంత్రి సమాధానం ఇస్తారని ముందే చెప్పినా విపక్షాలు వినలేదని, తీరా ఆయన మాట్లాడాక డిమాండ్లు మార్చి రాజీనామా కోరారని ఆరోపించారు. రాజ్యాంగపరమైన విధానాలను విస్మరించి, పార్లమెంటు తన ఇష్టానుసారమే నడవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారని జోషి ఘాటుగా వ్యాఖ్యానించారు.
