Work From Home: బ్యాంక్ ఉద్యోగులకు కేంద్రం బంపర్ ఆఫర్.. పొదుపు చర్యల్లో భాగంగా..
తమ ప్రధాన కార్యాలయాలు, శాఖా కార్యాలయాల కోసం అద్దెకు తీసుకున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని.. దీన్ని అన్ని సంస్థలు లక్ష్యంగా పెట్టుకోవాలని ఆ ఉత్తర్వులో పేర్కొంది.
Work From Home: ఇంధన కొరత భయాల నేపథ్యంలో పొదుపు చర్యలు పాటించాలని దేశ ప్రజలను పదే పదే ప్రధాని మోదీ కోరుతున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా ఇప్పటికే పలు చర్యలు కూడా చేపట్టింది కేంద్రం. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఆర్థిక సంస్థలు ఖర్చులను తగ్గించే చర్యలను అమలు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఉత్తర్వు ప్రకారం ప్రయాణాలపై కఠినమైన ఆంక్షలు, వీడియో కాన్ఫరెన్స్ ను విస్తృతంగా ఉపయోగించడం , దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం వంటివి ఈ చర్యల్లో ఉన్నాయి.
సోమవారం ఆర్థిక సేవల విభాగం జారీ చేసిన ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలతో పాటు లక్షలాది మంది ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇది విస్తృత పొదుపు చర్యలలో ఒక భాగం.
కొత్త నిబంధనల ప్రకారం, భౌతిక హాజరు తప్పనిసరి అయితే తప్ప, అన్ని సమావేశాలు, సమీక్షలు, సంప్రదింపులు తప్పనిసరిగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే నిర్వహించాలి. ఛైర్పర్సన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో సహా ఉన్నత స్థాయి కార్యనిర్వాహకుల విదేశీ ప్రయాణాలు నిర్దేశిత పరిమితులకు లోబడి ఉండాలి. సాధ్యమైనంత వరకు విదేశీ కార్యక్రమాలకు వర్చువల్గా హాజరు కావాలి.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయాలని సంస్థలను కోరింది ప్రభుత్వం. తమ ప్రధాన కార్యాలయాలు, శాఖా కార్యాలయాల కోసం అద్దెకు తీసుకున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని.. దీన్ని అన్ని సంస్థలు లక్ష్యంగా పెట్టుకోవాలని ఆ ఉత్తర్వులో పేర్కొంది.
వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్ లు..
కోవిడ్-19 మహమ్మారి సమయంలో అనుసరించిన వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్ లు వంటి పద్ధతులను పునరుద్ధరించాలని అధికారులకు, పౌరులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఈ వ్యవస్థలను తిరిగి ప్రారంభించడం జాతీయ ప్రయోజనాలకు మేలు చేస్తుందని ఆయన అన్నారు.
పెరుగుతున్న ముడిచమురు ధరలు, అస్థిరత భారత దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెంచుతున్నాయని మోదీ అన్నారు. కీలక చమురు రవాణ మార్గమైన హర్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అంతరాయాలు భారత్ వంటి చమురు దిగుమతి దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి.
మెట్రో కనెక్టివిటీ ఉన్న నగరాల్లోని ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని, ప్రైవేట్ వాహనాల అనవసర వినియోగాన్ని నివారించాలని ప్రధాని కోరారు. కార్లు అవసరమైన చోట కార్పూలింగ్ను ఆయన సిఫార్సు చేశారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృతంగా వినియోగించాలని, సరుకు రవాణాకు రైల్వేలను ఎక్కువగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు.
విదేశీ మారక నిల్వలను పరిరక్షించుకోవడానికి, మధ్యతరగతి ప్రజలు కనీసం ఒక సంవత్సరం పాటు విదేశీ విహారయాత్రలు, విదేశీ వివాహాలు, ఇతర అనవసర విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. బంగారం దిగుమతుల వల్ల నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది అంటూ ప్రజలు ఒక సంవత్సరం పాటు బంగారం కొనవద్దని మోదీ కోరారు. అలాగే దేశీయ పర్యాటకాన్ని, మేడిన్ ఇండియా ఉత్పత్తుల కొనుగోలును ప్రోత్సహించారు.
