రనౌట్ కోపంలో కుర్చీ విరగ్గొట్టిన ఆరోన్ ఫించ్

 

 

రనౌట్ అయ్యాడనే కోపంలో ఆరోన్ ఫించ్ స్టేడియంలో బీభత్సం సృష్టించాడు. అవుట్ అయి డ్రెస్సింగ్ రూమ్ చేరుతుండగా దారిలో కనిపించిన కుర్చీని తన బలమంతా చూపించి విరగ్గొట్టాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న దేశీవాలీ లీగ్(బిగ్ బాష్ లీగ్)బీబీఎల్‌లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మెల్బౌర్న్ రెనెగడ్స్.. మెల్బౌర్న్ స్టార్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెనెగడ్స్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది. 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న స్టార్స్ జట్టు తీవ్రంగా శ్రమించి రెనెగడ్స్ జట్టును 145 పరుగులకు కట్టడి చేయగలిగింది. ఆ తర్వాత చేధనలో విఫలమైన స్టార్స్ జట్టు కేవలం 132 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగడ్స్ జట్టుకు కెప్టెన్సీ వహించిన ఆరోన్ ఫించ్(13) భారీ అంచనాలతో బరిలోకి దిగాడు. 

అసలే ఫైనల్ మ్యాచ్ కావడంతో ప్రత్యర్థి జట్టుకు భారీ టార్గెట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టాడు. కానీ, జాక్సన్ బర్డ్ రనౌట్ చేయడంతో నిరుత్సాహంతో పెవిలియన్ బాట పట్టాడు. క్రీజులో ఉన్నంతసేపు సహనం వహించిన ఫించ్.. స్టేడియం లోపలకి వెళ్లగానే అక్కడ ఉన్న కుర్చీని బ్యాట్‌తో బలంగా కొట్టాడు. ఇంకా కోపాన్ని అదుపు చేసుకోలేక మరో సారి కొట్టడంతో విరిగిపోయింది. అయితేనేం, ఫించ్ పరుగులు చేయకపోయినా.. ఆ జట్టే గెలుపొందడంతో ట్రోఫీ గెలిచిన ఆనందంలో తన రనౌట్ సంగతి మర్చిపోయి సంబరాలు చేసుకున్నాడు.