Arshdeep Singh : చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏకైక భారత బౌలర్
టీమ్ఇండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) అరుదైన ఘనత సాధించాడు.
Arshdeep Singh creates history becames Most wickets for India in T20 World Cup history
- భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత
- టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా
- జింబాబ్వేతో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా
Arshdeep Singh : టీమ్ఇండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
గురువారం చెన్నైలోని చెపాక్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు జస్ప్రీత్ బుమ్రాను అధిగమించాడు. బుమ్రా 23 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు తీయగా అర్ష్‌దీప్ సింగ్ 19 మ్యాచ్‌ల్లోనే 35 వికెట్లు పడగొట్టాడు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..
* అర్ష్‌దీప్ సింగ్ – 19 మ్యాచ్‌ల్లో 35 వికెట్లు
* జస్ప్రీత్ బుమ్రా – 23 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు
* రవిచంద్రన్ అశ్విన్ – 24 మ్యాచ్‌ల్లో 32 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 30 మ్యాచ్‌ల్లో 29 వికెట్లు
* రవీంద్ర జడేజా – 30 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు
ప్రస్తుత టీ20 ప్రపంచకప్ 2026లో అర్ష్‌దీప్ సింగ్ ఐదు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (55; 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (50నాటౌట్; 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), తిలక్ వర్మ (44 నాటౌట్; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) లు రాణించారు.
అనంతరం 257 పరుగుల భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులకే పరిమితమైంది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్ (97 నాటౌట్; 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సికిందర్ రజా (31 ;21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. టీమ్ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబె లు తలా ఓ వికెట్ తీశారు.
