IND vs ENG : సెమీస్ మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ వార్నింగ్.. కాస్కోండి.. గురువారం వాంఖడేలో మొత్తం నిశ్శబ్దమే
సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ (IND vs ENG )వార్నింగ్ ఇచ్చాడు.
England all rounder Sam Curran warns india ahead of T20 World Cup 2026 IND vs ENG semis match
- గురువారం వాంఖడే వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య సెమీస్ మ్యాచ్
- ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు సామ్ కరన్ వార్నింగ్
- వాంఖడే గురించి మొత్తం తెలుసు..
IND vs ENG : టీ20 ప్రపంచకప్ 2026 సెమీస్‌లో భాగంగా గురువారం భారత్, ఇంగ్లాండ్ జట్లు ముంబైలోని వాంఖడే మైదానంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకోవాలని ఇరు జట్లు ఆశిస్తున్నాయి. కాగా.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌లో తలపడడం ఇది వరుసగా మూడో సారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ చేరుకుంటామనే ధీమాను వ్యక్తం చేశాడు. తాము గెలిస్తే మైదానం మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుందని, అలా చేయడమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చాడు.
‘ఇది (వాంఖడే) అద్భుతమైన మైదానం. ఇక్కడ ఎన్నో మ్యాచ్‌లను ఆడాము. ఈ మైదానం గురించి మొత్తం తెలుసు. సాధారణంగా ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. భారీ స్కోర్లు నమోదు కావొచ్చు. గురువారం రాత్రి మేము గెలిస్తే ఈ స్టేడియం నిశ్శబ్దంగా ఉంటుందని అనుకుంటున్నాను.’ అని సామ్ కరన్ అన్నాడు.
తమ జట్టులో చాలా మంది ప్లేయర్లకు భారత్‌లో ఆడిన అనుభవం ఉందన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లే కాకుండా ఐపీఎల్లో గత కొన్నాళ్లుగా తమ ఆటగాళ్లు భారత్‌లో ఆడుతున్నారని, కాబట్టి వారికి ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందన్నాడు. ఇక అభిషేక్ శర్మ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించాడు. మిగిలిన వారి కోసం కూడా వ్యూహాలను సిద్ధం చేసినట్లు చెప్పుకొచ్చాడు.
జోస్ బట్లర్ ఫామ్ గురించి..
ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు జోస్ బట్లర్ తనదైన శైలిలో రాణించలేదు. దాదాపుగా అన్ని మ్యాచ్‌ల్లో విఫలం అయ్యాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 62 పరుగులు మాత్రమే చేశాడు. ఈ విషయంపై సామ్ కరన్ స్పందిస్తూ జోస్ బట్లర్ ఫామ్‌పై తమకు ఎలాంటి ఆందోళన లేదన్నాడు.
అతడు నాణ్యమైన ఆటగాడు అని, ఒక్కసారి కుదురుకుంటే అతడు ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాడో అందరికి తెలుసునని అన్నాడు. ఈ మైదానంలో అతడు చాలా సార్లు రాణించాడని, గురువారం రాత్రి అతడి బ్యాట్ నుంచి పరుగులు వస్తాయని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.
