FIFA World Cup 2026 : ప్రపంచకప్‌లో ఈ మ్యాచ్‌లను అస్సలు మిస్ కావొద్దు.. ఫ్యాన్స్‌ను కట్టిపడేసే 5 హై వోల్టేజ్ మ్యాచ్‌లు ఇవే..
ఫిఫా ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశలో మొత్తం 72 మ్యాచ్‌లు జరగనుండగా ఓ ఐదు మ్యాచ్‌లపై మాత్రం అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.
Fifa World Cup 2026 top 5 most awaited group stage matches
FIFA World Cup 2026 : ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రారంభమైంది. మొత్తం 48 జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. 16 స్టేడియాల్లో 39 రోజుల పాటు మొత్తంగా 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 16 రోజుల పాటు మొత్తం 72 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ సుదీర్ఘమైన షెడ్యూల్లో కొన్ని మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాటిలో బ్రెజిల్-మొరాకో, ఫ్రాన్స్-సెనెగల్, ఇంగ్లాండ్-క్రొయేషియా వంటి మ్యాచ్‌లు ఉన్నాయి.
మిస్ అవ్వొద్దు.. ఈ 5 పోరులు!
- జూన్ 13న ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన బ్రెజిల్, ఆఫ్రికా ఫుట్‌బాల్‌లో కొత్త శక్తిగా ఎదిగిన మొరాకోతో తలపడనుంది. ఖతార్ ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరి సంచలనం సృష్టించిన మొరాకో మరోసారి తన సత్తా చాటాలని చూస్తోంది. బ్రెజిల్ జట్టు కార్లో అన్సెలోట్టి మార్గదర్శకత్వంలో బరిలోకి దిగుతోంది. నైపుణ్యం, వేగం, ఘనమైన చరిత్ర కలిగిన ఈ రెండు జట్ల పోరు అభిమానులకు కనువిందు చేయనుంది.
- జూన్ 16న ఫ్రాన్స్, సెనెగల్ మధ్య మ్యాచ్ జరగనుంది. 2002 ప్రపంచకప్‌లో అప్పటి డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఫ్రాన్స్‌ను సెనెగల్ ఓడించి ఫుట్‌బాల్ చరిత్రలోనే అతిపెద్ద షాక్ ఇచ్చింది. ఆ నాటి మ్యాచ్ జ్ఞాపకాలు ఇంకా అభిమానుల మనసులోనే మెదులుతూనే ఉన్నాయి. ఇక ఈ రెండు జట్లు దాదాపుగా 24 ఏళ్ల తరువాత మరోసారి తలపడుతున్నాయి. ఈక్రమంలో నాటి మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్రాన్స్ ఆరాటపడుతోంది.
- జూన్ 17న ఇంగ్లాండ్ వర్సెస్ క్రొయేషియా మ్యాచ్‌కు కూడా మంచి క్రేజ్ ఉంది. 2018 రష్యా వేదికగా జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్లో క్రొయేషియా చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోయింది. ఇప్పుడు థామస్ టుచెల్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. గ్రూప్-L లో ఆధిపత్యం సాధించడానికి ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది.
- జూన్ 19న పోర్చుగల్, దక్షిణ కొరియాలు తలపడనున్నాయి. 2022 ఖతార్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో పోర్చుగల్‌కు దక్షిణ కొరియా షాకిచ్చింది. మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని దక్షిణ కొరియా భావిస్తుండగా.. పోర్చుగల్ మాత్రం నాటి ఓటికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది.
- గ్రూప్ దశలోనే మరో ఆసక్తికర పోరు జూన్ 27న కొలంబియా, పోర్చుగల్ మధ్య జరగనుంది. మయామి ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు అన్ని అమ్ముడయ్యాయి. ఇరు జట్లలోనూ అటాకింగ్ స్టార్స్ ఉన్నారు. నాకౌట్ దశకు చేరుకోవడానికి ఈ మ్యాచ్ ఫలితం కీలకం అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
అభిమానుల భారీ మద్దతు, స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన, గ్రూప్ అర్హతలపై ప్రభావం వంటి అంశాలు ఈ ఐదు మ్యాచ్‌లను ప్రపంచకప్‌లో అత్యంత ఆసక్తికర పోరులుగా నిలబెడుతున్నాయి.
