Shai Hope : చాలా సంతోషంగా ఉంది.. అదొక్కటే మేం చేసిన మిస్టేక్ .. లేదంటనే..వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కీలక వ్యాఖ్యలు..
టీమ్ఇండియాపై తొలి టీ20 మ్యాచ్‌లో ఓడిపోవడంపై వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ (Shai Hope ) స్పందించాడు.
IND vs WI 1st T20 Shai Hope key comments after West Indies lost match against India
Shai Hope : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌కు శుభారంభం దక్కలేదు. లక్నో వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో విండీస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే తమ జట్టు ఓడిపోయిందని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ తెలిపాడు.
షై హోప్(52; 37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (56; 34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో నమన్ దీర్ మూడు, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (102 నాటౌట్; 43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ చేశాడు. ఇషాన్ కిషన్ (37 నాటౌట్; 27 బంతుల్లో 5 ఫోర్లు), అభిషేక్ శర్మ (21; 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించారు. విండీస్ బౌలర్లలో అకీల్ హోసేన్, రోస్టన్ ఛేజ్ చెరో వికెట్ పడగొట్టారు.
మా వ్యూహ్యం బెడిసికొట్టింది..
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ స్పందించాడు. తమ ఇన్నింగ్స్ ఆఖరిలో ఆశించిన పరుగులు చేయలేకపోయామన్నాడు. ‘బ్యాటింగ్ విషయంలో మేము కాస్త తొందరపాటుతో లేదా గందరగోళంగా ఆడామని నాకనిపించింది. మేము చాలా దూకుడుగా ఆడాము. కానీ భారతదేశంలో ఆడుతున్నప్పుడు మీరు మంచి స్కోరును బోర్డుపై ఉంచాలి. అదనంగా మరో 20 లేదా 30 పరుగులు చేయడం అవసరం. ఎందుకంటే లక్ష్యాన్ని కాపాడుకునేటప్పుడు.. అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండటం, పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారడం వంటి పరిస్థితులు ఉంటాయి.’ అని హోప్ అన్నాడు.
Shreyas Iyer : చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. టీ20ల్లో ఏకైక భారత కెప్టెన్..
జట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు బౌలింగ్ చేయగల మరికొంతమంది ఆల్ రౌండర్లు ఉంటే బాగుంటుంది, తద్వారా మీకు వేరే ప్రత్యామ్నాయాలు దొరుకుతాయి. కానీ ఈ రోజు మేము ఉన్న జట్టు కూర్పుతోనే ఆడాల్సి వచ్చింది. ఆటగాళ్లు ఏ నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ.. వారు తమ పనిని సమర్థవంతంగా చేస్తారని మేము ఆశించాము. కానీ ఈ రోజు భారత్‌పై విజయం సాధించడానికి మా దగ్గర తగినంత బలం లేకపోయింది. నేను చెప్పినట్లుగా ఇక్కడ లక్ష్యాన్ని నిర్దేశించడం ఎప్పుడూ సవాలుతో కూడుకున్నదే.’ అని హోప్ తెలిపాడు.
ఆరంభంలో స్పిన్నర్ల చేత ఎందుకు బౌలింగ్ చేయించలేదు అనే ప్రశ్న ఎదురుకాగా.. ‘మా జట్టులో కేవలం ఇద్దరు స్పిన్నర్లు మాత్రమే ఉన్నారు. నిజం చెప్పాలంటే వారు ఒక్కొక్కరు ఎనిమిది ఓవర్లు వేయాలని నేను కోరుకుంటాను. మేము అనుకున్నది ఏమిటంటే.. భారత్ మరికొన్ని వికెట్లు ఆరంభంలో పడి ఉంటే.. ఆ జట్టులో కొంతమంది ఎడమచేతి వాటం బ్యాటర్లు మిగిలి ఉండేవారు. అప్పుడు ‘చేజ్’ వచ్చి మధ్య ఓవర్లలో ప్రభావం చూపించే అవకాశం ఉండేది. కానీ ఈ రోజు మాకు ఆ వ్యూహం కలిసి రాలేదు. మాకు అదనపు స్పిన్నర్ ఉంటే బాగుండేదనిపించింది. మ్యాచ్ పూర్తి అయ్యాక ఆలోచిస్తే అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది అని ఎన్నో విషయాలు గుర్తుకు వస్తాయి. ఏదీ ఏమైనప్పటికి భారత జట్టు మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది.’ అని హోప్ అన్నాడు.
ఇక భారత దేశంలో ఆడడం, బ్యాటింగ్ చేయడం తనకు ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ క్రికెట్ ఆడే అవకాశం వచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుందన్నాడు.
