INDvsSL: వర్షం లేదు.. విచ్చలవిడిగా ఆడుకోవచ్చు

2020ని విజయంతో ఆరంభించాలని టీమిండియా.. శ్రీలంకలు ధనాధన్‌ పోరుకు సిద్ధమైయ్యాయి. ఆదివారం జరగాల్సి ఉన్న తొలి మ్యాచ్‌ రద్దు అవగా మంగళవారం జరిగే రెండో టీ20లో శ్రీలంకను ఢీకొట్టనుంది. టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు కోసం.. ప్లేయర్లు పెర్‌ఫార్మెన్స్ మెరుగుచేసుకోవాలి. రాహుల్‌ నుంచి తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌‌పై ఒత్తిడి ఎక్కువైంది.

సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లు అతడికి పెద్ద పరీక్షే. గాయం నుంచి కోలుకుని వచ్చిన అతడికి ఈ పరిస్థితి సవాలే. ఈ మ్యాచ్‌లో భారతే ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. గాయం నుంచి కోలుకున్న పేస్‌ బౌలర్‌ బుమ్రా జట్టులోకి రావడం గొప్ప సానుకూలాంశం. నిర్వహణ వైఫల్యం వల్ల తొలి మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

సంజు శాంసన్‌, మనీష్‌ పాండే మరోసారి బెంచ్‌కే పరిమితం కాక తప్పని పరిస్థితి. పదేళ్లలో ఏ ఫార్మాట్లోనూ భారత్‌పై లంక సిరీస్‌ నెగ్గలేదు. కోహ్లీసేనను అడ్డుకోవాలంటే మలింగ కెప్టెన్సీలోని లంక ప్లేయర్లు ఎటువంటి వ్యూహాలు రచిస్తారో మరి. మ్యాచ్‌ వేదిక హోల్కర్‌ స్టేడియంలోని పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముంది.

ఇదే వేదికగా జరిగిన 2017లో లంకతో టీ20లో భారత్‌ 5 వికెట్లకు 260 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్‌ 88 పరుగుల తేడాతో నెగ్గింది. వర్షం ముప్పు లేదు. మంచు ఎఫెక్ట్ తగ్గించడానికి స్టేడియంలో మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (ఎంపీసీఏ) ప్రత్యేకమైన కెమికల్స్ చల్లింది.