SunRisers Hyderabad : సన్‌రైజర్స్ ఈ తప్పులు సరిదిద్దుకోకపోతే ఫస్టు మ్యాచ్ ఫసక్..!
తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) జట్టు తలపడనుంది.
IPL 2026 If not SunRisers Hyderabad rectify these mistakes they will lose first match against rcb
- తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో సన్‌రైజర్స్ ఢీ
- బలహీనంగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్
SunRisers Hyderabad : నేటి (శనివారం, మార్చి 28) నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీని విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
అప్పుడెప్పుడో పదేళ్ల కిందట.. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. 2018, 2024 సీజన్లలో ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఈ క్రమంలో పదేళ్ల నిరీక్షణకు తెరదించాలని భావిస్తోంది సన్‌రైజర్స్. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ ను ఐపీఎల్ 2026 వేలంలో13 కోట్లు వెచ్చించి మరీ సొంతం చేసుకుంది.
ఇక రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నునొప్పితో సీజన్‌లోని ఫస్టాప్కు దూరంగా ఉండనున్నాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనుంది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్‌కుమార్ రెడ్డితో కూడిన విధ్వంసకర బ్యాటింగ్ లైనప్‌తో ప్రత్యర్థులను భయపెడుతోంది. గత సీజన్లో ఐపీఎల్ అత్యధిక స్కోరును మూడు సార్లు దాటింది.
బౌలింగ్ బలహీనం..
ఐపీఎల్‌లోనే అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ లైనప్ సన్‌రైజర్స్ సొంతం అయినప్పటికి కూడా ఓ విషయం తీవ్రంగా బాధిస్తోంది. అదే పేలవ బౌలింగ్. గతేడాది లీగ్ దశ నుంచి సన్‌రైజర్స్ నిష్ర్కమించడానికి ప్రధాన కారణం కూడా ఇదే. బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. కీలక సమయాల్లో వికెట్లు తీసే బౌలర్ కనపడడం లేదు. బ్యాటర్లు భారీ స్కోర్లు సాధిస్తున్నా కూడా బౌలర్లు ఒత్తిడికి లోనవుతుండడం ప్రతికూలాంశంగా మారింది. ఇక కెప్టెన్ కమిన్స్ ఈ సీజన్లో ఫస్టాప్ దూరం కావడంతో ఆ జట్టు బౌలింగ్ మరింత బలహీనంగా మారింది.
ఈ సీజన్లో పేసర్లు.. బ్రైడన్ కార్స్, జయదేవ్ ఉనద్కత్ లు కమిన్స్ లేని లోటును ఏ విధంగా భర్తీ చేస్తారు? ప్రత్యర్థి ఓపెనర్లను ఏ మేరకు నిలవరిస్తారు అన్నది చూడాల్సిందే. జీషన్ అన్సారి, శివాంగ్కుమార్, హర్ష్ దూబె, క్రెనిస్ పులెట్రా అందుబాటులో ఉన్నారు. అయినప్పటికి కూడా మిగిలిన జట్లతో పోలిస్తే సన్‌రైజర్స్ బౌలింగ్ బలహీనంగానే చెప్పవచ్చు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీని వదులుకోవడం సన్‌రైజర్స్ కు లాభం కలిగిస్తుందా? నష్టాన్ని కలిగిస్తుందా? అన్నది చూడాల్సిందే.
