PBKS vs GT : ఆ ఒక్క తప్పు వల్లే పంజాబ్ పై ఓడిపోయాం.. లేదంటేనా.. శుభ్‌మన్ గిల్ కామెంట్స్..
మంగళవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో (PBKS vs GT ) గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.
IPL 2026 Shubman Gill comments after Gujarat Titans lost match against Punjab Kings
- ఓటమితో సీజన్‌ను ఆరంభించిన గుజరాత్ టైటాన్స్
- పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోవడంపై స్పందించిన శుభ్‌మన్ గిల్
PBKS vs GT : ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. మంగళవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఆఖరి ఐదు ఓవర్లలో వేగంగా పరుగులు చేయకపోవడమే తమ ఓటమికి కారణం అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (39; 27 బంతుల్లో 6 ఫోర్లు), జోస్ బట్లర్ (38; 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిఫ్స్ (25; 17 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) లు రాణించారు. పంజాబ్ బౌలర్లలో విజయకుమార్ వైశాఖ్ మూడు వికెట్లు తీశాడు. యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్ ఓ వికెట్ సాధించాడు.
Hardik Pandya : గర్ల్ ఫ్రెండ్‌కు బెంజ్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. ఫోటోలు వైరల్
అనంతరం కూపర్ కానల్లీ (72 నాటౌట్; 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ కింగ్స్ 163 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి అందుకుంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (37; 24 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు తీశాడు. కగిసో రబాడ, అశోక్ శర్మ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ లు తలా ఓ వికెట్ సాధించారు.
ఆఖరి ఓవర్లలో వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయాం
మ్యాచ్ అనంతరం ఓటమిపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. మ్యాచ్‌లో 175 నుంచి 180 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోరకంగా ఉండేదని అభిప్రాయ పడ్డాడు. వర్షం కారణంగా పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ సులువైందన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి కూడా తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పుకొచ్చాడు.
బ్యాటింగ్‌లో చివరి ఐదు నుంచి ఆరు ఓవర్లలో తాము వేగంగా పరుగులు చేయలేకపోయామన్నాడు. ఇది 210 నుంచి 220 వికెట్ కాదన్నాడు. కనీసం 180 పరుగులు చేసినా ఫలితం మరోరకంగా ఉండేదన్నాడు. పిచ్ కాస్త కఠినంగా ఉందన్నాడు. బంతి పాత బడే కొద్ది మరింత స్లోగా వస్తుందన్నాడు. దీంతో షాట్లు ఆడడం చాలా కష్టమైందన్నాడు.
అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో వర్షం రావడంతో బంతి తడిసిందన్నాడు. దీంతో బంతి బ్యాట్ పైకి వచ్చిందన్నాడు. ఈ క్రమంలో పంజాబ్ బ్యాటర్లకు బ్యాటింగ్ ఈజీగా మారిందన్నాడు. అయినప్పటికి తాము మెరుగైన బౌలింగ్ చేశామన్నాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి కొనసాగించామని చెప్పుకొచ్చాడు.
MI vs KKR : మ్యాచ్ జరుగుతుండగా ప్రియురాలికి ప్రపోజ్.. రింగ్ పోయింది.. కట్ చేస్తే..
ఇక ప్రసిద్ద్ కృష్ణ ను ఆలస్యంగా బౌలింగ్‌కు తీసుకురావడంపై మాట్లాడుతూ.. అతడు సరైన సమయంలోనే వచ్చి వికెట్లు పడగొట్టాడని, మ్యాచ్‌లో తమను నిలిపాడన్నాడు. వాస్తవానికి అతడితో ముందుగా బౌలింగ్ చేస్తే బాగుండేదని చాలా మంది భావించారు. కానీ పిచ్ స్లోగా మారుతుండడంతో ఆఖరిలో వేగంగా బౌలింగ్ చేసే బౌలర్ అయితే వికెట్లు తీయగలడని భావించే అతడిని ఆలస్యంగా బౌలింగ్‌కు తీసుకువచ్చామన్నాడు. అతడు నెట్స్‌లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు.
అశోక్ శర్మ గురించి మాట్లాడుతూ.. అతడు అద్భుతమైన ప్లేయర్ అని మెచ్చుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే బాగా బౌలింగ్ చేశాడని అన్నాడు. అతడు అనుభవం సాధించే కొద్ది విలువైన ఆటగాడిగా మారతాడని చెప్పుకొచ్చాడు. రెండు నెలల క్రితం అతడిని క్యాంప్‌లో కలిసినప్పుడు కొత్త బంతితో అతడు బౌలింగ్ చేసిన విధానం తనను బాగా ఆకట్టుకుందన్నాడు. అతడు అద్భుతమైన ఫీల్డర్ అని, రాబోయే మ్యాచ్‌ల్లో అతడు సత్తా చాటుతాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని రానున్న మ్యాచ్‌ల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తామన్నాడు గిల్.
