Shubman Gill : శుభ్‌మన్ గిల్ 2028 టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో లేడా? సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారు? అంతర్జాతీయ టీ20 క్రికెట్లో చివరి మ్యాచ్ ఆడేసినట్లేనా?
టీ20 ప్రపంచకప్ 2028 భారత జట్టు ప్రణాళికల్లో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఉన్నాడా? లేడా? అనే విషయం పై ప్రస్తుతం చర్చజరుగుతోంది.
Is Shubman Gill not Part Of Team India T20 World Cup 2028 Plans Report
- ఐపీఎల్ 2026లో రాణించినా కూడా భారత టీ20 జట్టులో గిల్‌కు దక్కని చోటు
- 2028 టీ20 ప్రపంచకప్ భారత జట్టు ప్రణాళిల్లో గిల్ లేడా?
- సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారు?
Shubman Gill : టీమ్ఇండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించాడు. 45.75 సగటు 163 స్ట్రైక్‌రేటుతో ఈ కుడిచేతి వాటం ఆటగాడు 732 పరుగులు చేశాడు. అయినప్పటికి కూడా అతడికి భారత టీ20 జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లతో పాటు 2026 ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్లలోనూ గిల్‌కు చోటు లభించలేదు. దీంతో టీ20లకు అతడిని దూరం పెట్టారా? అన్న సందేహం వస్తోంది. టాప్ ఆర్డర్లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి దూకుడుగా ఆడే ఆటగాళ్లు ఉండడంతో గిల్ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు.
సెలక్టర్ల ప్రణాళికల్లో గిల్ లేడా?
గిల్ అంతర్జాతీయ టీ20 కెరీర్ ముగిసిందని భావించడం తొందరపాటే అవుతుంది. సెలెక్టర్ల దృష్టి ప్రస్తుతం 2028లో జరగనున్న టీ20 వరల్డ్ కప్, లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌పై ఉంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. గిల్ ప్రస్తుతం టీ20 ప్రణాళికల్లో లేకపోయినా, ఈ మెగా ఈవెంట్లకు ముందు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అతనికి విశ్రాంతినిస్తూ.. 2028 నాటికి జట్టును సిద్ధం చేసే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్ ఆధారంగా తుది నిర్ణయాలు ఉంటాయని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.
గిల్ వర్క్లోడ్పై సెలక్టర్ల ఆందోళన..!
భారత టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్.. నిరంతరం మూడు ఫార్మాట్లలో ఆడటం వల్ల అలసిపోయే అవకాశం ఉందని బోర్డు భావిస్తోంది. వన్డే ప్రపంచకప్ 2027 సమయానికి గిల్‌ను శారీరకంగా, మానసిక సిద్ధంగా ఉంచడం బీసీసీఐ ప్రథమ ప్రాధాన్యతగా మారింది. అందుకే రాబోయే 18 నెలల పాటు కేవలం టెస్టులు, వన్డేలపైనే దృష్టి సారించాలని గిల్‌కు స్పష్టమైన సమాచారం అందించారు. ఈ విరామం అతనికి ఐసీసీ టోర్నీలకు తాజాగా సిద్ధమవ్వడానికి ఉపయోగపడుతుంది.
గిల్ అంతర్జాతీయ టీ20లకు దూరమైనా, ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా కొనసాగుతాడు. టీ20లలో తన స్థానాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఐపీఎల్ ఓ వేదికగా నిలుస్తుంది. ప్రస్తుతానికి ఇతర యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తూనే.. 2028లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ సమయానికి గిల్‌ను మళ్ళీ ప్రధాన రేసులోకి తీసుకురావాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. కాబట్టి గిల్ అభిమానులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఒక వ్యూహాత్మక విరామం మాత్రమే.
